న్యూఢిల్లీ, జూన్ 8: పని-వ్యక్తిగత జీవితం సమతుల్యత అనేది ఒక సాధారణ పదంలా అన్పించవచ్చు. కానీ యూరప్‌లో దానిని జీవన వేదంలా భావించడమే కాక, దానిని ఆచరణలో అమలు చేసి చూపిస్తారని ఒక భారత సాఫ్ట్‌వేర్ డెవలపర్ అభిప్రాయపడ్డారు. స్వీడన్‌లో పనిచేస్తున్న అశుతోష్ సమల్ ఇన్‌స్టాలో దీని గురించి పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా ఆడుతు పాడుతు పనిచేసే విధానాన్ని తన వీడియోలో పేర్కొన్నారు. స్వీడన్‌లో సాధారణంగా ఉద్యోగులు పనిని ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారని, కొన్ని కార్యాలయాల్లో పని ప్రారంభానికి ముందు ఉచితంగా అల్పాహారం కూడా అందజేస్తారని తెలిపారు.
పని ప్రదేశాలలో ఎలాంటి డెస్క్‌ల కేటాయింపు ఉండదని, సీఈవో సహా ప్రతి ఒక్కరినీ వారికి ఇష్టమైన ప్రదేశంలో కూర్చోబెడతారని, అధికార క్రమాన్ని తొలగిస్తారని, అందరూ ఒకటే స్థాయి అని, ప్రయోషన్ల కోసం పోటీ పడక్కర్లేదని, సీఈవో కూడా కొన్ని సార్లు ఉద్యోగుల పక్కనే కూర్చుని పని చేస్తుంటారని సమల్ పేర్కొన్నారు. పని సమయంలో విరామాలు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తారని, నచ్చిన ఆటలు ఆడుకోవచ్చునని, కాఫీ తాగుతూ ఆస్వాదించవచ్చునని, వేసవి కాలంలో కొన్ని కార్యాలయాల్లో పని గంటలను 8 నుంచి ఏడు గంటలకు కుదిస్తారని తెలిపారు.
2025-06-08T20:41:39Z