ఏక్‌దమ్‌ ఫిట్‌

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా ఉండాలంటే.. బరువును అదుపులో ఉంచాలి. అయితే, అదనపు కొవ్వును వదిలించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్నవారికి శాస్త్రీయమైన మార్గాన్ని చూపుతున్నారు క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌, మైండ్‌ అండ్‌ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోచ్‌.. దీపిక చలసాని. ఆమె నేతృత్వంలోని ‘ఫిట్‌4లైఫ్‌ ఇండియా’ఊబకాయంపై యుద్ధం ప్రకటించింది.

దీపిక చలసాని.. పుణెలో పుట్టి పెరిగారు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరి బోర్డింగ్‌ స్కూల్‌లో చదివారు. సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఎంబీఏ పట్టా కూడా ఉంది. ఆ తర్వాత కార్పొరేట్‌ కెరీర్‌ మొదలైంది. మైక్రోసాఫ్ట్‌, విప్రో, గూగుల్‌ తదితర దిగ్గజ సంస్థలకు సేవలందించారు. ఆ సమయంలోనే పెండ్లయింది. ఇద్దరు పిల్లలు. కెరీర్‌లో చాలా పేరు సంపాదించారు. ఖ్యాతి వచ్చినా, డబ్బు పోగైనా.. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. తరచూ ప్రయాణాలు, తీరిక లేనంత ఒత్తిడి వల్ల రోగాలు చుట్టు ముట్టాయి. నాలుగు పదులు నిండకుండానే బీపీ, షుగర్‌ దాడి చేశాయి. నిస్సత్తువ ఆవహించింది. బరువు కూడా అధికమైంది. ఒక దశలో 95 కిలోలు దాటింది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించొచ్చు. ఒంటినిండా రోగాలు ఉన్నప్పుడు, బీరువా నిండా డబ్బున్నా వృథా అని తెలుసుకున్నారు. ఉద్యోగానికి స్వస్తి పలికి.. బరువు తగ్గే మార్గాలు అన్వేషించారు. ఎంతోకొంత తగ్గినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చేవి. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ‘ఇంత చదువు చదివి నా ఆరోగ్యాన్ని నేనే కాపాడుకోలేక పోతున్నానే?’ అని బాధపడేవారు.

సమాధానం కోసం..

దీపిక తండ్రి సుబ్బారావు కూడా ఊబకాయంతో బాధపడేవారు. కానీ పట్టుదలతో పాతిక కిలోలు వదిలించుకున్నారు. ‘నేను మాత్రం తగ్గలేనా?’ అనుకున్నారు దీపిక. ‘బరువు తగ్గాలంటే ఏం చేయాలి?’ అనే ప్రశ్నకు జవాబు వెతికారు. ఈ క్రమంలో కొత్త విషయం తెలిసింది. డైట్‌ కంట్రోల్‌ కంటే మైండ్‌ కంట్రోల్‌ ముఖ్యమని అర్థమైంది. మైండ్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి వివిధ కోర్సులు చేశారు. ‘ఈటింగ్‌ థెరపీ’ ప్రాక్టీస్‌ చేశారు. పళ్లెంలో పోషకాలకు స్థానం కల్పించారు. ఒక్కసారిగా భారీగా బరువు తగ్గడం కంటే.. మెల్లమెల్లగా తగ్గే పద్ధతినే ఎంచుకున్నారు. రెండు సంవత్సరాల్లో 95 కిలోల నుంచి 68 కిలోలకు వచ్చారు. బరువు తగ్గుతున్నప్పుడు బాడీలో డిటాక్సిఫికేషన్‌ మొదలవుతుంది. నీరసంగా అనిపిస్తుంది. ఫుడ్‌ ైస్టెల్‌ మారడం వల్ల తరచూ మూడ్‌ మారిపోతుంది. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఇష్టమైన రుచులకు దూరంగా ఉండటం కష్టంగానే ఉంటుంది. ఇవన్నీ అదుపు చేయడానికే.. మైండ్‌ కంట్రోల్‌ థెరపీని పరిచయం చేస్తారు దీపిక. మనసును గెలిస్తే, పొట్టను గెలవడం ఏమంత కష్టం కాదు. అలా మనసు కేంద్రంగా ఊబకాయంపై పోరాటం మొదలుపెట్టారు.

Nutritionist

సన్నిహితులతో మొదలై..

క్రమంగా 23 కిలోల బరువు తగ్గిన దీపికను చూసి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. ‘ఎలా సాధ్యమైంది?’ అని అడిగారు. దీంతో దీపిక తాను అనుసరించిన వెయిట్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాలను వారికీ పరిచయం చేశారు. చాలామందిలో మంచి ఫలితాలు కనిపించాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికోసం ‘ఫిట్‌4లైఫ్‌ ఇండియా’ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేశారు దీపిక. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో శిక్షణ ప్రారంభించారు. అంతలోనే కరోనా రావడంతో ఆన్‌లైన్‌కే పరిమితం చేశారు. అక్కడితో ఆగకుండా.. విదేశాలకు వెళ్లి అధునాతన పద్ధతులు అధ్యయనం చేశారు. ఇప్పుడు ఐదు ఖండాల్లో ఫిట్‌4లైఫ్‌ ఇండియా సేవలందిస్తున్నది. దేశ మంతటా ఫిట్‌4లైఫ్‌కు క్లయింట్లు ఉన్నారు. ‘బరువు తగ్గడం వల్ల శరీరమే కాదు, మనసూ తేలికపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. నా దృష్టిలో ఇదొక సామాజిక వ్యాపారం. ఊబకాయంపై యుద్ధం. అధిక బరువుపై పోరాటం’ అంటారు దీపిక.

తగ్గాలంటే..

ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ తప్పితే.. వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. శరీర వ్యవస్థను, జీర్ణశక్తిని బట్టి డైట్‌ నిర్ణయించుకోవాలి. మేం ఇచ్చే ఫుడ్‌ వాళ్ల మైండ్‌సెట్‌కి సూట్‌ అవుతుందా లేదా అన్నదీ పరిశీలిస్తాం. ఫ్యామిలీ ఫుడ్‌ హిస్టరీని బట్టి ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసి.. బరువుకు, వయసుకు తగినట్టు ప్రొటీన్లు అందిస్తాం.

– దీపిక చలసాని ఫిట్‌4లైఫ్‌ ఇండియా కో-ఫౌండర్‌

…? సుంకరి ప్రవీణ్‌కుమార్‌

2023-05-25T22:20:38Z dg43tfdfdgfd