వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఒక్కొక్కసారి దొరికిన చాప చిన్నదైనా వరాలు కురిపిస్తుంది. ఒక్కొక్కసారి అతి భారీ చేప అయినా అది ఏమాత్రం ఉపయోగం ఉండదంటున్నారు మత్స్యకారులు. కొన్ని చేపలు తినడానికి కాదు, వైద్య వృత్తిలో కీలకంగా పనిచేసే చేపలు కూడా సముద్రంలో ఉంటాయి. అలాంటి చేప ఒకటి ఆ జిల్లాలో మత్స్యకారుల వలలో చిక్కింది.. దీంతో వారి పంట పండింది. ఇంతకీ ఆ చేప ఏంటి.. ఎక్కడ పడింది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
గోదావరి జిల్లాలకు సంబంధించి ఒకపక్క గోదావరిలో, మరోపక్క సముద్రంలో దొరికే చేపలకు ప్రత్యేకమైన పేరు ఉంటుందని చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో గోదావరిలో దొరికే పులస చేప రేటు వింటే "అమ్మో" అనాల్సిందే. "పుస్తెలు అమ్మయినా సరే పులస తినాలి" అంటారు. అలాగే సముద్రంలో దొరికే కచిడి చేప కూడా అంతే డిమాండ్ ఉంటుంది. బరువుతో సంబంధం లేకుండా ఈ చేప ధర అమాంతం లక్షల్లో ఉంటుంది అంటే నమ్ముతారా.. కానీ ఇది తప్పక నమ్మాల్సిన విషయం. తాజాగా కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. ఏకంగా 25 కేజీలు బరువు గల కచిడి చేప వారి వలలో చిక్కుకుంది. ఇంకేముంది ఆ ఒక్క చేప 3.95 లక్షల విలువ చేయడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు.
ఈ కచిడి చేపను దేనికి ఉపయోగిస్తారు: వైద్య వృత్తిలో కీలకంగా ఈ చేపకు సంబంధించిన పార్టులు ఉపయోగిస్తారట. ముఖ్యంగా సిజరింగ్ చేసే తరుణంలో వాడే అతి ఖరీదైన దారాలు కూడా ఈ చేప నుంచే తయారవుతాయి అంటున్నారు నిపుణులు. దీని శాస్త్రీయ నామం "ప్రోటోనిభ్యస్" ముఖ్యంగా కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచి తయారు చేస్తారట. సౌందర్య సాధనాల తయారీలో కూడా ఎక్కువగా ఈ చేపకు సంబంధించిన పొట్ట భాగాన్ని వినియోగిస్తారని, అదేవిధంగా ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను కూడా వాడుతారు అంటూ పలువురు పేర్కొంటున్నారు.
ఇన్ని రకాలుగా ఈ ఒక్క చేప ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చేప ధర పెద్ద మొత్తంలో ఉంటుందన్నారు నిపుణులు. ఏది ఏమైనా తాజాగా కాకినాడ మత్స్యకారులకు ఈ చేప పడడం ఒక వరంగా మారింది అంటున్నారు మత్స్యకారులు. అయితే అన్నివేళలా ఈ చేప పడే అవకాశం ఉండదని, ఏడాదిలో రెండు మూడు సార్లు మాత్రం మత్స్యకారులకు చిక్కుతుందంటూ స్థానిక మత్స్యకారులు పేర్కొంటున్నారు.
2025-02-04T15:04:50Z