Owls: చాలా మంది గుడ్లగూబను నేరుగా చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవి రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తాయి, పగటి పూట ఎక్కువగా కనిపించవు. గుడ్లగూబ పెద్ద పెద్ద కళ్లు, విచిత్రమైన అరుపులు ప్రత్యేకంగా ఉంటాయి. వీటితోపాటు గుడ్లగూబలో ఎవ్వరికీ పెద్దగా తెలియని ప్రత్యేక లక్షణాలు చాలానే ఉన్నాయి. అలాంటి పది ఆశ్చర్యకర విషయాలు ఏవో తెలుసుకుందాం.
అసాధారణమైన వినికిడి
గుడ్లగూబలకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. వాటి చెవులు చాలా పక్షుల వలె సమానంగా ఉండవు. ఒక చెవి మరొక దాని కంటే పెద్దగా ఉంటుంది. వివిధ దిశలు, ఎత్తుల నుంచి శబ్దాలను వినడానికి సహాయపడతాయి. దీంతోనే పూర్తి చీకటిలో లేదా దట్టమైన పరిసరాల్లో కూడా చాలా కచ్చితత్వంతో గుడ్లగూబ ఎరను పసిగడుతుంది.
నిశ్శబ్ధంగా ఎగిరే పక్షి
సాధారణంగా పక్షులు గాల్లోకి ఎగిరినప్పుడు రెక్కల శబ్ధం వినిపిస్తుంది. కానీ గుడ్లగూబలు నిశ్శబ్దంగా ఎగురుతాయి. వాటి ఈకల అంచులు గాలి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసేలా, శబ్దాన్ని తగ్గించేలా రూపొందాయి. అందుకే గుడ్లగూబలు వినిపించకుండా ఎరపై దాడి చేస్తాయి.
పెద్ద కళ్ళు
గుడ్లగూబలు ముందు వైపు, పెద్ద కళ్లు ఉంటాయి. వీలైనంత ఎక్కువ కాంతిని గ్రహించగలవు. తక్కువ వెలుతురులో కూడా వాటి కళ్లు చూడగలవు. అయితే గుడ్లగూబలు మనుషుల్లా తమ కళ్లను కదపలేవు. కాబట్టి అవి చుట్టూ చూసేందుకు మెడను అనువుగా తిప్పగలవు.
తిరిగే తల
గుడ్లగూబలు తమ తలలను 270 డిగ్రీల వరకు తిప్పగలవు. శరీరాన్ని కదల్చకుండా దాదాపు అన్ని దిశల్లో చూడగలవు. ఈ సామర్థ్యం అదనపు మెడ వెన్నుపూసల కారణంగా వచ్చింది. ఇవి మనుషుల్లో 7 ఉంటే, గుడ్లగూబల్లో 14 ఉంటాయి. ఇలా కదలకుండానే గుడ్లగూబలు వేటాడే జంతువులను గుర్తించగలవు.
వైవిధ్యమైన ఆహారం
గుడ్లగూబలు వాటి జాతులు, ఆవాసాలను బట్టి అనేక రకాల ఆహారాన్ని తింటాయి. చాలా గుడ్లగూబలు ఎలుకలు, వోల్స్ వంటి చిన్న క్షీరదాలను వేటాడతాయి. మరికొన్ని కీటకాలు, పక్షులు, చేపలను కూడా తింటాయి. బార్న్ గుడ్లగూబ వంటి కొన్ని పెద్ద గుడ్లగూబలు చిన్న సరీసృపాలు, ఉభయచరాలను కూడా తినవచ్చు.
మభ్యపెట్టే సామర్థ్యం
గుడ్లగూబలు తమ పరిసరాలలో సులువుగా కలిసిపోగలవు. వాటి ఈకలు తరచుగా పర్యావరణంలోని రంగులను పోలి ఉంటాయి. జంతువులకు దొరక్కుండా, వాటిని మభ్యపెట్టేందుకు చెట్టు బెరడు, ఆకుల్లో కలిసి పోతుంది.
బలమైన ముక్కు
గుడ్లగూబలకు బలమైన, హుక్డ్ ముక్కులు కలిగి ఉంటాయి. అవి వాటి ఎరను చీల్చడానికి అనువుగా ఉంటాయి. ముక్కు, పదునైన గోళ్లతో గుడ్లగూబ దాడి చేస్తుంది. చిన్న క్షీరదాల నుంచి పక్షులు, కీటకాల వరకు తింటుంది.
సాంస్కృతిక ప్రాముఖ్యత
గుడ్లగూబలు మానవ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రాచీన గ్రీస్‌లో గుడ్లగూబలు జ్ఞానం అందించే దేవత ఎథీనాతో ముడిపడి ఉన్నాయి. ఇతర సంస్కృతులలో అవి రహస్యం, జ్ఞానం లేదా వినాశనానికి సంబంధించిన చిహ్నాలుగా పేర్కొన్నారు. జానపద కథలు, పురాణాలు, సాహిత్యంలో కూడా గుడ్లగూబల ప్రస్తావన ఉంటుంది.
రెగ్యుర్జిటేటెడ్ పెల్లెట్స్
గుడ్లగూబలు తిన్న తర్వాత, అవి తిన్న జంతువుల ఎముకలు, బొచ్చు, ఈకలను కలిగి ఉన్న గుళికలను(Regurgitated Pellets) ఉమ్మివేస్తాయి. గుడ్లగూబలు విశ్రాంతి తీసుకునే చోట ఈ గుళికలు సాధారణంగా కనిపిస్తాయి. గుడ్లగూబలు ఏమి తింటాయి, ఎలా వేటాడతాయో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ గుళికలను పరిశీలిస్తారు.
విస్తృత జాతులు
ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ రకాల గుడ్లగూబలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వేర్వేరు వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. ఇందులో చిన్న చిన్న ఎల్ఫ్ గుడ్లగూబ నుంచి ఐదు అడుగుల వరకు రెక్కలు కలిగిన పెద్ద కొమ్ముల గుడ్లగూబ వరకు ఉంటాయి. గుడ్లగూబలు అడవులు, గడ్డి భూములు, ఎడారులు, పర్వతాల సహా వివిధ ప్రదేశాల్లో కనిపిస్తాయి.
2024-09-04T14:01:51Z dg43tfdfdgfd