నా కాబోయే భర్త నలుపు

నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. తనూ ఇష్టపడుతున్నాడు. రెండు కుటుంబాలూ మాట్లాడుకుని ముహూర్తం నిశ్చయించాయి. త్వరలోనే ఒక్కటి కానున్నాం. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ మధ్యే ఓ స్నేహితురాలు నాలో అనుమానపు బీజాలు నాటింది. నేను తెల్లగా ఉంటాను. మా ఇంట్లో అందరూ తెలుపే. ఆ అబ్బాయిదేమో చామన ఛాయ. కానీ అతని ఇంట్లో వాళ్లంతా కారునలుపు. నాకు పుట్టబోయే బిడ్డలు కూడా నల్లగా ఉంటారేమో అని భయంగా ఉంది. నా బిడ్డలు చందమామలా తెల్లగా మెరిసిపోవాలని నా కోరిక. అలా అని, అతనికి దూరం కాలేను. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.

– ఓ పాఠకురాలు

ఇది చాలా చిన్న సమస్యే. కానీ తీవ్రమైన సమస్య. కాపురాల్ని కూల్చేంత శక్తి దీనికి ఉంది. ప్రేమికులను విడదీయగలదు కూడా. మనిషి చర్మం రంగును రకరకాల అంశాలు నిర్ణయిస్తాయి. అందులో జన్యువు కూడా ఒకటి. అంతకు మించి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక రంగు ఎక్కువనో, ఒక రంగు తక్కువనో భావించాల్సిన పన్లేదు. పురాణాల్లో దుర్గాదేవి, ద్రౌపది, కృష్ణుడు, రాముడు కూడా నల్లనివారే. ఈ వివక్షను చూసే.. ‘నల్ల కలువకూ, మల్లెపూవుకూ పోటీ పెడతారా?’ అని ప్రశ్నిస్తాడో కవి. పుట్టబోయే బిడ్డ రంగు గురించి చింతలు పెట్టుకోకుండా, తనను ఎంతగొప్పగా తీర్చిదిద్దాలన్న కోణంలో ఆలోచించండి.

2023-03-16T21:54:11Z dg43tfdfdgfd