మహబూబాబాద్/నర్సింహులపేట/కురవి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘వండుకునేందుకు పాత్రలు లేవు.. సరుకులు పెట్టుకునే స్థలంలేదు.. ముట్టిద్దామంటే గ్యాస్ పొయ్యి లేదు.. మరో పదిరోజులు అన్నం పెట్టండి సార్’ అంటూ మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాంతండాలోని ఓ మహిళ బుధవారం గ్రామానికి వచ్చిన ప్రత్యేకాధికారి నర్సింహారావును దీనంగా వేడుకున్నది. ఈ ఘటన వరద బీభత్సం సృష్టించి నాలుగు రోజులు గడుస్తున్నా అక్కడి ప్రజల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన తర్వాత పది రోజులకు సరిపడానిత్యావసర సరుకులు పంపిణీ చేసినా వారికి వండుకునే పరిస్థితిలేదు. ప్రస్తుతం సీతరాంతండా ప్రజలకు సమీపంలోని లక్ష్యతండాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన రైతువేదికే దిక్కయ్యింది. అక్కడే అన్నం తింటూ బస చేస్తున్నారు. తండాలో దుర్వాసన భరించలేకుండా ఉంది. సీఎం వచ్చిపోయిన తర్వాత అధికారులు తూతూ మంత్రంగానే పనులు నిర్వహిస్తున్నారు.
నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఇప్పుడిప్పుడే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి ఒక కుటుంబానికి రెండు మూడు బిందెల కంటే ఎకువ ఇవ్వడం లేదు. కేసముద్రం, డోర్నకల్ తదితర మండలాల్లో పంటపొలాల్లో ఇసుక మేటలు వేసి ఎడారిలా కనిపిస్తున్నాయి. నర్సింహులపేట మండలంలో పెసరపంట చేనులోనే మొలకెత్తింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
వర్షాలకు నీట మునిగిన నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత బుధవారం సందర్శించారు. వరద బీభత్సానికి కూలిన ఇండ్లు, కొట్టుకుపోయిన గొర్లు, ద్విచక్ర వాహనాలు, కట్ట తెగి చుక్క నీరులేని చెరువును పరిశీలించారు. గడప, గడపకూ తిరిగి బాధితులను అక్కున చేర్చుకుని వారి కన్నీళ్లను తుడిచి ఓదార్చారు. ఈ సందర్భంగా 150 బాధిత కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
రెండు ఎకరాల్లో పెసర పంట వేసిన. తెంపుదామనుకున్న సమయంలో వాన మొదలై పంట మొత్తం నేల పాలైంది. వరదకు తడిసి కాయ మొలకెత్తింది. రెండెకరాల్లో పుట్టెడు పెసళ్లు వప్తాయనుకున్నా. గింజ కూడా చేతికి వచ్చే అవకాశం లేదు. నాకు రూ. 60 వేల వరకు నష్టమైంది. ఇంత జరిగినా అధికారులు మా పంటలు చూసేందుకు రాలేదు.
– గుగులోతు పట్టాభి, దూప్యతండా, నర్సింహులపేట మండలం, మహబూబాబాద్ జిల్లా
2024-09-04T22:54:24Z dg43tfdfdgfd