పర్యావరణ ప్రభావాల గురించి మాట్లాడుకున్నప్పుడు, కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయని, ఉక్కపోతలు పెరుగుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని నిత్యం చర్చించుకుంటూ ఉంటాం.
కానీ, పర్యావరణ మార్పు గురించి చాలా అరుదుగా చర్చిస్తుంటాం.
పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో, ఫంగస్ వ్యాప్తి చెంది, అనేక ఫంగల్ వ్యాధులు వస్తున్నాయి.
ముఖ్యంగా ప్రపంచంలోని శీతల ప్రదేశాల్లో గతంలో అక్కడి చలి వాతావరణం వల్ల ఫంగస్ జీవించలేకపోయేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
సాధారణంగా వెచ్చగా ఉండే దేశాల్లో కనిపించే, లక్షల మందిని ప్రభావితం చేసే ప్రాణాంతక ఫంగస్ త్వరలోనే యూరప్‌కు వ్యాప్తి చెందుతుందని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ పరిశోధన తెలిపింది.
ఆస్పెర్‌గిల్లోసిస్ అనేది ఒక ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వల్ల 18 లక్షల మంది చనిపోతున్నారు. ఆఫ్రికా, దక్షిణ అమెరికా నుంచి ఉత్తర ప్రాంతాల వైపు ఈ వ్యాధి వ్యాపిస్తుందని అంచనాలున్నాయి.
ప్రముఖ టీవీ డ్రామా ''ది లాస్ట్ ఆఫ్ అజ్''లో ఒక ఫంగల్ డిసీజ్ వల్ల మెదడు పాడుకావడం, ప్రజలు మూర్ఖులుగా మారడం చూపిస్తారు.
అయితే, ఇది అతిశయోక్తి కాదని నిపుణులు అంటున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎక్కువవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో, ప్రాణాంతక ఫంగస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.
ఫంగల్ ఫాథోజెన్స్ (బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగై లేదా పారాసైట్స్) మన చుట్టూ ఉన్నాయని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌లో పనిచేసే పీడియాట్రిక్ ఇన్‌ఫెక్షస్ డిసీజస్ ప్రొఫెసర్ అడెలియా వారిస్ చెప్పారు.
భూఉపరితలంపై వీటిని గుర్తించ వచ్చు. గాలి ద్వారా మైళ్ల దూరం ఇవి వ్యాప్తి చెందుతాయి.
ఫంగల్ డిసీజ్‌ను ఎలా నిర్వచిస్తారో తెలుపాలని అడెలియాను అడిగాం
''ఫంగల్ ఫాథోజెన్స్ వల్ల అభివృద్ధి అయినవే ఈ ఫంగల్ వ్యాధులు. బ్యాక్టీరియా లేదా వైరస్‌లు కలిగించే వ్యాధుల మాదిరే ఇవి కూడా ఉంటాయి. కొన్ని ఫంగల్ వ్యాధులు మనిషి మెదడును దెబ్బతీస్తాయి. ప్రాణాంతకంగా మార్చుతాయి.'' అని అడెలియా వారిస్ చెప్పారు.
''ఫంగస్ చర్మానికి కూడా సోకుతుంది. చుట్టూ వాతావరణంలో ఉండే ఈ ఫంగస్, చేతిగోళ్లకు, కాళ్లగోళ్లకు వ్యాపిస్తుంది.'' అని ప్రొఫెసర్ వారిస్ తెలిపారు.
'' అరికాళ్లు పగిలితే, వాటిల్లో చిక్కుకుని తేలికగా ఫంగస్ వ్యాపిస్తుంది. కానీ, అది ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాదు. కానీ ఊపిరి పీల్చుకున్నప్పుడు ఫంగల్ పాథోజెన్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి తరువాత ప్రాణాంతకంగా మారతాయి. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు.'' అని వివరించారు.
ఊపిరితిత్తుల వ్యాధుల ఉన్న వారికి, ఈ ఫంగస్ మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు.
''ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు తక్కువగా ఉంటాయి. రోగుల బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను ఈ ఫంగస్ సద్వినియోగం చేసుకుంటుంది.'' అని తెలిపారు.
కొన్ని ఫంగైలు మన శరీరంలోనే ఉంటాయి. ఇది ఈస్ట్ రకానికి చెందిన ఫంగస్. కాండిడా అల్బికాన్స్ దీనికి అతిపెద్ద ఉదాహరణ.
''చాలామంది ఆరోగ్యవంతులైన ప్రజల కడుపులో ఈస్ట్ ఉంటుంది. ఇది తిన్న ఆహార పదార్థాలు జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. కొన్నిసార్లు ఈస్ట్ కడుపు నుంచి బయటికి వచ్చి, రక్తంలో కలవడం మొదలుపెడుతుంది. రక్తంలో ఇన్‌ఫెక్షన్ వ్యాప్తికి కారణమవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా ఇది జరుగుతూ ఉంటుంది.'' అని అడెలియా వారిస్ తెలిపారు.
మన చుట్టూ చాలా రకాల ఫంగస్‌లు ఎప్పటి నుంచో ఉంటున్నాయి కదా.. మరి ఇప్పుడే అవి ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నాయన్నదే ప్రశ్న.
ఫంగల్ వ్యాధులు పెరుగుతుండటం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్ లాగోస్‌లో పనిచేసే క్లినికల్ బయోలజీ ప్రొఫెసర్ రీటా ఒలోడెలి చెప్పారు.
'' ప్రతి ఒక్కరూ దీని తీవ్రతను అర్థం చేసుకోవాలి. కరోనా మహమ్మారి అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. అంతకుముందు కంటే ఫంగల్ వ్యాధుల వ్యాప్తి బాగా పెరిగింది. దీనికి భూమిపై పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు కూడా కారణం. ఫంగల్ పాథోజెన్లు వేడిలో చాలా వేగంగా పెరగగలవు. .'' అని తెలిపారు.
పర్యావరణ మార్పు పాత్ర గురించి చర్చించే ముందు, మరో కారణం గురించి తెలుసుకోవాలి. మెడికల్ సైన్స్, టెక్నాలజీ అభివృద్ధితో..ఆయుర్దాయం కూడా పెరిగింది. అయితే, తేలికగా ఈ వ్యాధుల బారిన పడటానికి ఇది కూడా ఒక కారణమా?
వైద్య సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. చాలా సమర్థవంతమైన ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని రీటా ఒలోడెలి చెప్పారు.
వీటివల్ల, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు లేదా బాగా జబ్బు పడిన రోగులు కూడా ఎక్కువ కాలం బతకగలుగుతున్నారు. ఇలాంటి వారిని ఫంగల్ వ్యాధులు తేలికగా లక్ష్యంగా చేసుకుంటాయి.
'' రోగులలో అవయవాల మార్పిడి జరుగుతుంటుంది. కానీ, సర్జరీ తర్వాత ఈ రోగులలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ రోగులలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఇలాంటి వారు ఫంగల్ వ్యాధుల బారిన తేలికగా పడతారు. '' అని ప్రొఫెసర్ ఒలోడెలి వివరించారు.
కానీ, గ్లోబల్ సౌత్ దేశాలలో అంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో, పశ్చిమ దేశాలలో ఈ ఫంగల్ వ్యాధుల గుర్తింపు, చికిత్సకు ఉన్న వైద్య సదుపాయాల్లో చాలా వ్యత్యాసం ఉంది.
హెచ్ఐవీ ఎయిడ్స్ రోగుల సంఖ్య ఎక్కువగానే ఉండే వేడి దేశాలలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు చాలా సాధారణం. ఎందుకంటే, హెచ్ఐవీ ఎయిడ్స్ శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీంతో, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తేలికగా వ్యాప్తి చెందుతాయి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో, ఉత్తర దేశాలలో కూడా వేడి పెరగడం మొదలైంది. దీంతో, పాటు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతోంది.
భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫంగల్ వ్యాధుల సంక్రమణ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతుందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాలిక్యులర్ బయాలజీ, ఇమ్యునాలజీ ప్రొఫెసర్ ఆర్టురో కాసాదేవాల్ చెప్పారు.
''భూమిపై ప్రతి జీవి పర్యావరణానికి అనుగుణంగా జీవించడం నేర్చుకుంటుందని మనకు తెలుసు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. సాధారణ ఉష్ణోగ్రతలలో మొక్కలు, మట్టిలో పెరిగే అనేక జీవులున్నాయి. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో వైద్య శాస్త్రానికి తెలియని ఇలాంటి ఫంగల్ వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.'' అని ప్రొఫెసర్ కాసాదేవాల్ అన్నారు.
పర్యావరణ మార్పు అనేది చాలా పెద్ద విషయం. ఫంగస్ ఎదిగేందుకు ఎలాంటి రకమైన ఉష్ణోగ్రత అనువైనదో చూడాలి. దీని ఆధారంగా భవిష్యత్‌లో ప్రపంచంలో ఏ ప్రాంతాలకు ఫంగస్ వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవచ్చు.
ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఎడారులు ఏర్పడుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు పడుతున్నాయి. ఈ రెండూ ఫంగస్ వృద్ధికి సాయం చేయగలవు. ఉదాహరణకు, అమెరికాలోని నైరుతి ఎడారి ప్రాంతంలో కుసిడియోడిస్ ఇమిటస్ అనే ఫంగస్ వల్ల కలిగే వ్యాధి కనిపించడం ప్రారంభించింది.
'' ఎడారుల విస్తరిస్తుండటంతో, ఈ జీవి ఉపజాతులు ఉద్భవిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు, పర్యావరణ మార్పు అనేవి తేమపై ప్రభావం చూపుతాయని మనకు తెలుసు. '' అని ప్రొఫెసర్ కాసాదేవాల్ చెప్పారు.
బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ, మునపటి కంటే మన శరీర ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలైంది. అంతకుముందు శరీరం వేడిగా ఉండేది. దీంతో, శరీరంలో ఫంగస్‌లు పెరగడం కష్టంగా ఉండేది. కానీ,ఇటీవలి దశాబ్దాల్లో శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి.
శరీరంలో సాధారణ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ ఉంటాయని కాసాదేవాల్ చెప్పారు. ఈ సెల్సియస్‌లో ఫంగస్ బతకడం కష్టం. అందుకే ఫంగల్ వ్యాధులు ఉన్నవారికి వారి గోళ్ల కింద ఫంగస్ పెరుగుతుంది, ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం అధునాతన మందుల సాయంతో చాలా వ్యాధులు నియంత్రణలో ఉంటున్నాయి. ఈ మందుల వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో, ఫంగల్ వ్యాధులు పెరిగేందుకు సులభమవుతోంది.
ఫంగల్ వ్యాధులకు వాడే డ్రగ్ అజలీస్. దీన్ని సాధారణంగా ఫంగస్ నుంచి పంటలను రక్షించేందుకు వాడుతుంటారు.
ఈ డ్రగ్ వాడకం విపరీతంగా పెరుగుతుండటంతో అవి తమను తాము రక్షించుకునేందుకు అలవాటుపడ్డాయని బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఫంగల్ వ్యాధుల ప్రొఫెసర్ మైఖేల్ బ్రోమ్లీ అన్నారు.
''సాధారణంగా అజిల్ క్లాస్ డ్రగ్‌లను ఫంగల్ వ్యాధులకు చికిత్స చేసేందుకు ఆస్పత్రుల్లో వాడుతుంటారు. అంతకుముందు లాగా ఈ డ్రగ్స్ అంత సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఈ డ్రగ్ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఫంగల్ వ్యాధుల్లో పెరుగుతోంది. దీనికి కారణం వాతావరణంలో ఫంగీసైడ్స్ లేదా యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఉండటం. ఫంగల్ వ్యాధికారక క్రిముల నుంచి పంటలను కాపాడేందుకు ఈ మందులను వాడుతున్నారు.'' అని ప్రొఫెసర్ మైఖేల్ బ్రోమ్లీ చెప్పారు.
వ్యవసాయంలో ఆస్పెర్‌గిల్లస్ డ్రగ్స్ పెద్ద ఎత్తున వాడుతుండటంతో, ఈ డ్రగ్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని ఈ ఫంగై పొందింది.
పంటల్లో ఫంగీసైడ్స్ వినియోగాన్ని నిషేధించాలని కొంతమంది ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు మైఖేల్ బ్రోమ్లీ చెప్పారు. కానీ, ఒకవేళ ఇదే జరిగితే, పంటలు దెబ్బతింటాయని, ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. ఈ మందులకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని కనుగొనేందుకు బ్రోమ్లీ ప్రయత్నిస్తున్నారు.
ఫంగస్ డీఎన్ఏ ను నాశనం చేసే కెమికల్స్‌ను సృష్టించినట్లు ఆయన చెప్పారు. దీనివల్ల ఫంగల్ కణాలు జీవించలేవన్నారు. ఈ సమస్యకు మరో పరిష్కారం ఫోస్మానోజెపిక్స్. ఫంగస్‌ను ఆపగల విప్లవాత్మక పదార్థం ఇది. ఇతర యాంటీ ఫంగల్ మందుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. వచ్చే కొన్నేళ్లలో ఈ మందు అందుబాటులోకి వస్తుందని ప్రొఫెసర్ బ్రోమ్లీ చెప్పారు. ఇది మరో ఆశ.
ఆస్పెర్‌గిల్లస్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వేలమందిని చంపేస్తోన్న ప్రాణాంతక వ్యాధి.
గాలి, భూమిపై ఉండే ఫంగస్, ప్రజల ఊపిరితిత్తులోకి చేరుతుందని మైఖేల్ బ్రోమ్లీ చెప్పారు. ఈ కొత్త మందుల వల్ల ఆస్పెర్‌గిల్లస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయొచ్చని ఆయన ఆశిస్తున్నారు. భవిష్యత్‌లో ఇవి చాలా సాయం చేస్తాయంటున్నారు.
అయితే, ఈ ప్రాణాంతక ఫంగస్‌లు వ్యాప్తి చెందకుండా ఆపవచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కొన్ని ఫంగల్ వ్యాధులు తక్కువ ప్రమాదం. కొన్ని ప్రాణాంతకం. సరైన పరికరాలు లేకుండా వీటిని నిర్ధరించడం కష్టం.
ఫంగస్ కేవలం శరీరంలోనే ఉండదు. బాహ్య వాతావరణంలో కూడా ఉంటుంది. జనాభా పెరుగుతుంటే, ఆహార పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని అందుకునేందుకు, కొన్ని పంటలను కాపాడేందుకు ఫంగీసైడ్లను వాడటం చాలా అవసరం. ఫంగల్ వ్యాధుల చికిత్సకు కొన్ని కొత్త మందులు అభివృద్ధి చేస్తున్నారు. ఫంగల్ వ్యాధులను ఇవి నియంత్రించవచ్చు. అయితే, ఈ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోగలమా? అనేదే ప్రశ్న.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)