బొద్దింకల్ని చూడగానే చిరాకు పుడుతుంది. ఈ విషయం అలా ఉంచితే బొద్దింకలు ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు బొద్దింకల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి ద్వారా వ్యాపించే కొన్ని ముఖ్యమైన వ్యాధుల గురించి తెలుసుకుని ఉండాలి.
ఫుడ్ పాయిజనింగ్: అపరిశుభ్ర వాతావరణంలో తిరిగే బొద్దింకలు తాకితే మనం తాగేనీళ్ల, తినే ఆహారం కలుషితమవుతాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, డయేరియా (అతిసారం), జ్వరం లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ (ఓఆర్‌ఎస్)తో తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో యాంటిబయాటిక్స్ అవసరమూ ఉంటుంది.
టైఫాయిడ్: బొద్దింకల నుంచి వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనది టైఫాయిడ్. ఇది సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. కలుషిత జలం తాగినప్పుడు, కలుషిత ఆహారం తిన్నప్పుడు ఈ క్రిమి మన శరీరాల్లో చేరిపోతుంది. తీవ్రమైన జ్వరం, బలహీనత, తలనొప్పి, కొన్నిసార్లు మలబద్ధకం, ఇంకొన్నిసార్లు డయేరియా (అతిసారం).. ఇవి టైఫాయిడ్ లక్షణాలు. క్రిమి సోకిన 12 నుంచి 72 గంటల్లో టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి. తగినంత విశ్రాంతి, యాంటిబయాటిక్స్‌తో దీన్నుంచి విముక్తి పొందొచ్చు.
కలరా: బొద్దింకల నుంచి వ్యాపించే మరో వ్యాధి కలరా. అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా కలరా సోకుతుంది. అతిసారం, నీళ్ల విరేచనాలు, వాంతులు మొదలైనవి దీని లక్షణాలు. డీహైడ్రేషన్ సమస్య ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్, యాంటిబయాటిక్స్ అవసరమవుతాయి.
పరిశుభ్రతే ప్రధానం: బొద్దింకల మూలంగా వ్యాధులు రాకూడదనుకుంటే ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారంపై మూతలు పెట్టాలి. చెత్తబుట్టలను క్రమం తప్పకుండా కడిగి శుభ్రం చేస్తూ ఉండాలి. అవసరాన్ని బట్టి పెస్ట్ కంట్రోల్ చేయిస్తూ ఉండాలి. చికిత్స కంటే వ్యాధి రాకుండా నివారించుకోవడం ఉత్తమం. అనుకోకుండా బొద్దింకల వల్ల ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యలు, ఇతర లక్షణాలు కనిపిస్తే సత్వరమే వైద్య సహాయం పొందాలి.
2025-06-09T21:22:53Z