మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఈ అలవాట్లను తప్పకుండా నేర్పండి!

తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల భవిష్యత్తు బాగుండటానికి కొన్ని అలవాట్లను వారికి ఖచ్చితంగా నేర్పాల్సి ఉంటుంది. అప్పుడే తల్లిదండ్రులుగా మీకు మంచి గుర్తింపు రావడంతో పాటుగా మీ పిల్లలకు కూడా సమాజంలో మంచి పేరు వస్తుంది. 

 

మన మంచి  మర్యాదలే ఒక వ్యక్తిని సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. మీ పిల్లలు కూడా ఇలాంటి గుర్తింపును పొందాలంటే మాత్రం.. చిన్న వయసులోనే వారికి మంచి నడవడిక నేర్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని అలవాట్లను నేర్పితే వారి భవిష్యత్తుకు ఏ డోకా ఉండదు. అలాగే వారికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్కరూ వారిని చూసి ఎన్నో నేర్చుకుంటారు. పిల్లలు మంచి అలవాట్లను అనుసరిస్తుంటే అది వారి ప్రవర్తనగా మారుతుంది. మీకు తెలుసా? పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో మంచి అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మీ పిల్లలు చెడు అలవాట్ల వైపు వెల్లకుండా కాపాడుతాయి. అందుకే పిల్లలకు నేర్పాల్సిన కొన్ని మంచి అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 

ఆరోగ్యకరమైన సమాజంలో..

పిల్లలు పెద్దయ్యాక వారి అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. పిల్లల సమాజాన్ని, తమ చుట్టు పక్క వారిని, స్నేహితులను  గమనిస్తూ తమ అలవాట్లను చాలా వరకు మార్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆరోగ్యకరమైన సమాజంలో ఎదగనివ్వాలి. అప్పుడే వారు మంచి మనుషులుగా ఎదుగుతారు. 

రెండుసార్లు బ్రష్ 

మంచి అలవాట్లలో రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం కూడా ఉంది. ఇది మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మీ పిల్లలు ప్రతిరోజూ ఉదయం పళ్లు తోముకోవడం, పడుకునే ముందు పళ్లు తోముకోవడం నేర్పండి. ఇది చాలా మంచి అలవాటు. మీ పిల్లల ఆరోగ్యంగా ఉండటానికి వారి నోరు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.

 

రోజూ స్నానం 

పిల్లలు ప్రతిరోజూ స్నానం చేసేలా చూడాలి. ఎందుకంటే పిల్లలు ఒక్క దగ్గర కుదురుగా ఉండరు. దుమ్ము, దూళిలో ఆడుకోవడం, పరిగెత్తడం వల్ల వారి శరీరానికి దుమ్ము, బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఇది మీ పిల్లల చర్మం లేదా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే వారికి రోజూ స్నానం చేసే అలవాటును నేర్పండి. 

 

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్

పిల్లలకు చెడు ఆహారాలను తినే అలవాటును అస్సలు నేర్పకండి. వారికి మంచి ఫుడ్ నే పెట్టండి. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో హెల్తీ ఫుడ్ ను పెట్టండి.  అల్పాహారంలో ఒక దినచర్యను అనుసరించండి. సరైన సమయంలో రోజుకు మూడుసార్లు అల్పాహారం ఇవ్వండి. దీంతో మీ పిల్లలు సరిగ్గా తినగలుగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. చెడు ఆహారాలకు అలవాటు పడరు.

 

చేతులు కడుక్కోవడం

పిల్లలు ఆడుకున్న తర్వాత, తినే ముందు, బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా చేతులను కడుక్కోవడం కూడా వారికి నేర్పండి. ఎందుకంటే పిల్లల చేతులు శుభ్రంగా ఉంటేనే వారు హెల్తీగా ఉంటారు. చేతులను సబ్బు, నీటితో 20 సెకన్ల పాటు కడగమని చెప్పండి. 

 

తగినంత తాగునీరు

మీ పిల్లలకు ప్రతిరోజూ పుష్కలంగా నీళ్లను తాగడం అలవాటు చేయండి. ఎందుకంటే ఈ  అలవాటు మీ పిల్లల గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పిల్లలకు కూల్ డ్రింక్స్ ను ఇవ్వడం మానుకోండి. ఇది వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అలాగే పిట్లలు రోజూ గంట, రెండు గంటలైన బయట ఆడుకోమని చెప్పాలి. ఇది వారిని ఫిట్ గా ఉంచుతుంది. 

 

పుస్తక పఠనం

మీ పిల్లలు ప్రతిరోజూ పుస్తకాలు చదివేలా చేయండి. ఎందుకంటే ఇది  వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పిల్లలు ఒక్కరే చదవాలంటే చదవలేరు. కాబట్టి మీరు కూడా వారిముందు చదవండి. మిమ్మల్ని చూసి వారు కూడా చేసే అవకాశం ఉంది. పుస్తకాలు చదివే అలవాటు మీ పిల్లల జీవితాలకు మార్గనిర్దేశం చేస్తుంది.

కుటుంబంతో సమయం 

పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాగానే కుటుంబ సభ్యులందరితో కూర్చోబెట్టండి. అలాగే  మీ పిల్లలకు ఈ రోజు స్కూల్ ఎలా గడిచిందో అడగండి. అలాగే వారికి ఎవైనా సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకోండి. 

స్నేహితులతో సమయం

మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంట్లో కూర్చోబెట్టకుండా.. కాసేపు స్నేహితులతో బయటకు వెళ్లడం, వారితో ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. పిల్లలు సంతోషంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీళ్లు కూడా సమాజంతో సామరస్యంగా జీవించడం నేర్చుకుంటారు.

2024-07-10T11:06:12Z dg43tfdfdgfd