Rapido Fixed Commission: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో దశాబ్దాలుగా స్విగ్గీ (Swiggy), జొమాటోలదే (Zomato) ఆధిపత్యం. అయితే, ఇప్పుడు దీనిని బద్దలు కొట్టడానికి, క్యాబ్ సేవలందిస్తూ విజయవంతమైన ర్యాపిడో.. భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతోంది! ర్యాపిడో అనుసరించబోయే సరికొత్త, ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్ ఈ రెండు దిగ్గజాలకు గుబులు పుట్టిస్తోంది. ఈ వార్తతో ఇప్పటికే స్విగ్గీ, జొమాటో షేర్లు సోమవారం మార్కెట్లో ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం.. 2025, జూన్ 9న స్విగ్గీ షేరు ధర దాదాపు 3 శాతం నష్టంతో రూ. 364 వద్ద స్థిరపడింది. ఎటర్నల్ (జొమాటో మాతృ సంస్థ) షేరు ధర దాదాపు 2 శాతం నష్టంతో రూ. 257 వద్ద సెషన్ ముగించింది.
కమీషన్ వివరాలు: ఇది స్విగ్గీ, జొమాటోలు సాధారణంగా వసూలు చేసే 16-30 శాతం కమీషన్‌తో పోలిస్తే భారీ తగ్గింపు. ర్యాపిడో ఒక ఫిక్స్‌డ్ ఫీజు నిర్మాణాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ రూ. 400 లోపు ఆర్డర్లకు రూ. 25
రూ. 400 పైబడిన ఆర్డర్లకు రూ. 50
వినియోగదారులు తమ ఫుడ్ ఆర్డర్‌లను నేరుగా ర్యాపిడో యాప్ ద్వారానే చేయగలుగుతారు, అందులో భాగస్వామ్య రెస్టారెంట్లు లిస్ట్ అవుతాయి. ఈ కొత్త ఫుడ్ డెలివరీ సేవ కోసం పైలట్ కార్యక్రమం జూన్ చివరి నాటికి లేదా జులై మొదటి వారంలో బెంగళూరులో ప్రారంభించాలని చూస్తున్నారు.
ర్యాపిడో ఈ రంగంలోకి రావడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే, జొమాటో, స్విగ్గీలు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై అనేక చిన్న రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు, 'ది గార్లిక్ బ్రెడ్' వ్యవస్థాపకుడు వండిట్ మాలిక్ లింక్డ్‌ఇన్‌లో పంచుకున్న వివరాల ప్రకారం, కేవలం కనిపించడానికి మాత్రమే జొమాటోలో ఒక్కో ఆర్డర్‌కు రూ. 30కి పైగా అడ్వర్టైజింగ్ ఖర్చులు అవుతున్నాయని, ఇది తమ కార్యకలాపాలను లాభదాయకం కాని విధంగా చేస్తుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు స్విగ్గీ, జొమాటోల ప్రస్తుత కమీషన్ నిర్మాణాలపై రెస్టారెంట్లలో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి.
ర్యాపిడో గణనీయమైన సంఖ్యలో రెస్టారెంట్లను, ఆ తర్వాత కస్టమర్లను ఆకర్షించగలిగితే, అది స్విగ్గీ, జొమాటోల ఆర్డర్ పరిమాణాలను తగ్గించొచ్చు లేదా పోటీలో నిలబడటానికి వారి కమీషన్ రేట్లను తగ్గించేలా బలవంతం చేయవచ్చు. ఇవి.. వారి లాభాదాయాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.
2025-06-09T13:25:51Z