‘వినాయక చవితి’ హిందువులకు అతి ముఖ్యమైన పండుగ. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి ప్రతిమను భక్తిశ్రద్ధలతో పూజించి, ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేయడం ఏటా ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. అయితే, ఈ పండుగ జరుపుకొనే విధానం అసలు సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నదా, లేదా? అనే విషయాన్ని భక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంప్రదాయం ప్రకారం ప్రకృతిలో లభించే మట్టితో వినాయకుని ప్రతిమను తయారుచేసి పత్రి, పూలతో ఘనంగా పూజించిన తర్వాత, ఆ వినాయకుడిని మళ్లీ అదే ప్రకృతి ఒడిలోకి చేర్చాలి.
వినాయకుడి ప్రతిమను తయారుచేయడం నుంచి పూజించడం, నిమజ్జనం చేయడం దాకా అంతా ప్రకృతి కేంద్రంగా జరుగుతుంది. అంటే, సంప్రదాయ పూజ పద్ధతిలో ‘రీసైకిల్’ అనే ఒక పర్యావరణ నియమం మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ, ప్రస్తుతం సమాజంలో వినాయక చవితి పండుగ జరుపుకొనే విధానం పర్యావరణ విధ్వంసం కలిగించే విధంగా ఉంటున్నది. మట్టితో తయారుచేసిన ప్రతిమలకు బదులుగా ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’ అనే విష రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను పూజించడం ఆనవాయితీగా మారిపోయింది.
‘మట్టి’ జీవం గల ఒక పదార్థం. అందుకే మొక్కల నుంచి మహావృక్షాలు సహా అనేక జీవజాతులకు అది జీవం పోస్తుంది. అందుకే, మట్టి వినాయకుడిని పూజించడమంటే ఒక సజీవమైన దేవుడి ప్రతిమను పూజించినట్లుగా భావించాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ఎలాంటి మొక్కలు, జీవజాతులు పెరగవు. ఎందుకంటే, ఇది జీవులను నశింపజేసే ఒక నిర్జీవ విష పదార్థం. అంతేకాదు, వినాయక ప్రతిమలను అందంగా అలంకరించడం కోసం వాడుతున్న రంగులు కూడా ఆ ప్రతిమలను మరింత విషపూరితంగా మారుస్తున్నాయి. అంటే, భక్తులు తొమ్మిది రోజుల పాటు పూజిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఒక నిర్జీవమైన, జీవం లేని విష పదార్థాలతో కూడినవేననటంలో సందేహం లేదు. మరి, ఇలాంటి ప్రతిమలను పూజిస్తే ఫలితం దక్కుతుందో, లేదో భక్తులే శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించుకోవాలి. అంతేకాదు, పూజించిన తర్వాత దుర్గంధంతో కూడిన ట్యాంక్‌బండ్ వంటి మురికి నీటిలో ఆ ప్రతిమను నిమజ్జనం చేయడమంటే దేవుడిని పూర్తిగా అగౌరవపరిచినట్టే. ఎందుకంటే అలాంటి దుర్గంధపు నీటిలో మనమే స్నానం చేయం!
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని చేస్తాయి. అవి చెరువు అడుగు భాగంలో ఘన, వ్యర్థ పదార్థంగా ఉండిపోయి క్రమేపి పూడిక పరిమాణాన్ని పెంచుతాయి. అధిక మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం లవణాలుండటం వల్ల అవి నీటి కఠినత్వాన్ని పెంచడమే కాకుండా, చెరువుల్లోని నీటిని ఉప్పు నీరుగా మారుస్తాయి. ఈ విగ్రహాలు తయారుచేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గాల్లోకి విడుదల చేసే వాయువులతో శ్వాసకోశ వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వ్యర్థాలు కలిగిన నీటిని సాగుకు వాడినప్పుడు కాలక్రమేణా సారవంతమైన వ్యవసాయ భూములు నిస్సారంగా మారి వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. వీటిలో వాడే కొబ్బరి పీచు నీటిలో కుళ్లిపోతుంది. తద్వారా నీటిలోని ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోతాయి. కొబ్బరి పీచులోని రసాయన సమ్మేళనాలు నీటిలోకి విడుదల కావడం వల్ల నీటిలో ఆమ్లత్వం పెరుగుతుంది. విగ్రహాల సుందరీకరణ కోసం వాడే రంగులు క్యాన్సర్ కారకాలు. ఈ రంగుల వల్ల చెరువుల్లోని నీటి రంగు కూడా మారిపోతుంది. ‘బయో మాగ్నిఫికేషన్’ ప్రక్రియ ద్వారా రంగు పదార్థాలు మానవుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాదు, ఆ రంగునీళ్లలో నివసించే చేపల వంటి జలచరాలలోకి, మొక్కల్లోకి ప్రవేశించి ఆహారం ద్వారా మనుషుల శరీరాల్లోకి కూడా ప్రవేశిస్తాయి.
ఒకప్పుడు మహా గణపతి నవరాత్రి ఉత్సవాలకు మాత్రమే పరిమితమైన ఈ పద్ధతి, ఈ మధ్యకాలంలో దసరా నవరాత్రి ఉత్సవాల పేరిట కూడా కొనసాగుతున్నది. మనం నిత్యం తాగే నీటి వనరులను కలుషితం చేయడం వల్ల ఆ నీటిని మళ్లీ మంచినీరుగా మార్చుకోవడానికి పెద్దమొత్తంలో ఖర్చుచేసి రివర్స్ ఆస్మాసిస్(ఆర్‌వో) వంటి ఖరీదైన టెక్నాలజీలతో శుభ్రపరచాల్సిన పరిస్థితి వస్తున్నది. ఆ నీటిలో సరైన మినరల్స్ లేకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రకృతి మనకు సహజంగా ఇచ్చిన వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. పెరుగుతున్న జనాభాకనుకూలంగా రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన నీటి వనరులను అందించాలి. పర్యావరణ కలుషితానికి కారణమయ్యే విషపూరిత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని భక్తులు గ్రహించాల్సిందిగా మనవి.
(వ్యాసకర్త: ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, హైదరాబాద్)
డాక్టర్ శ్రీదరాల రాము
94411 84667
2024-09-05T00:24:25Z dg43tfdfdgfd