మనం పర్వతాలను కొలుస్తాం. నదులను పూజిస్తాం. అడవులను ఆరాధిస్తాం. వాయువును దేవుడిగా భావిస్తాం. భూమిని తల్లిగా పిలుస్తాం. అదంతా మన సంస్కృతిలో భాగమేనని గొప్పగా చాటుకుంటాం. కానీ, కాలుష్యంలో మనం ప్రపంచంలోని ఐదు దుర్భర దేశాల్లో ఒకటిగా నిలవడం మన ఆచరణలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నది. మన నిర్లక్ష్యానికి, ప్రకృతి విధ్వంసానికి నిలువెత్తు సాక్ష్యం లాంటి ఈ కఠోర సత్యాన్ని ప్రపంచ గాలి నాణ్యత నివేదిక (2024) బయటపెట్టింది. మన మాటలకు ఆచరణకు మధ్య ఏ మాత్రం సం బంధం లేదని ఇది తెలియజేస్తున్నది. మనకు గల ఎన్నో భ్రమలను ఈ నివేదిక పటాపంచలు చేసింది. 2024లో మన గాలిలో ధూళికణాల స్థాయి ఘనపు మీటరుకు 50.6 మైక్రో గ్రాములుగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన స్థాయి కంటే ఇది పదింతలు పైగా ఉండటం గమనార్హం. స్విట్జర్లాండ్ వాయు నాణ్యతా సాంకేతిక సంస్థ ఐక్యూ ఎయిర్ మార్చి 11న విడుదల చేసిన ఈ నివేదికలో ఇంకా దిగ్భ్రాంతికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో చాద్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, కాంగో తర్వాత ఐదో స్థానంలో భారత్ ఉండటం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ప్రపంచంలోని 100 కాలుష్య భరిత నగరాల్లో 70 భారత్‌కు చెందినవే కావడం అందులో ఒకటి. పైగా అగ్రస్థానంలో ఉన్న నాలుగు నగరాల్లోనూ మనవి నాలుగు నగరాలున్నాయి. ఈశాన్యంలో ఇంకా కాలుష్యం జడలు విప్పుకోలేదని ఇంతవరకు మనం అనుకుంటున్నాం.
మేఘాలయలోని ఓ సరస్సు అడుగు భాగం స్పష్టంగా కనిపించే స్ఫటిక సదృశంగా ఉంటుదని కథలు కథలుగా చెప్పుకొంటారు. కానీ పై నివేదిక ప్రకారం మేఘాలయలోని బిర్నిహాట్ ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో మొదటిస్థానంలో నిలవడం విస్మయం కలిగిస్తున్నది. అక్కడ వాయుధూళి కణాల స్థాయి 128.2గా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన పరిమితి కన్నా 25 రెట్లు అధికమన్న మాట. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమంటే భారత్ ధూళి కాలుష్యం విషయంలో సొంత ప్రమాణాలు కలిగి ఉండటం. డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన దానికంటే అది నాలుగింతలుగా ఉండటం ఏమిటి? కాలుష్యంపై ఖాతరులేని తనాన్ని ఇది సూచించడం లేదా? డాటా సేకరణలో ముందంజ సాధించినప్పటికీ ఆచరణలో వెనుకబడిపోవడం జరుగుతున్నదనేది వాస్తవం. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం వంటి చర్యలు ప్రభుత్వం చేపడుతున్నప్పటికీ వాటి అమల్లో అవకతవకలు, మౌలిక యంత్రాంగం లోటుపాట్ల కారణంగా సవాళ్లు ఎదురవుతున్నాయని నివేదిక పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. గ్యాస్ సిలిండర్ విషయమే తీసుకుంటే కట్టెల పొయ్యిలను తగ్గించడానికి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేపట్టా రు. మొదటిది ఉచితమే కానీ, తదుపరి సిలిండర్లు కొనే స్థోమత లేక చాలామంది గృహిణు లు మళ్లీ కట్టెల పొయ్యి వైపే మొగ్గడం తెలిసిం దే. అలాగని ప్రపంచ దేశాల పరిస్థితి ఏమంత ఆశావహంగా లేదు. 2024లో 17 శాతం నగరాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితికి లోబడి ధూళికణాలు కలిగి ఉన్నాయి.
పసిఫిక్ సముద్రంలో భాగమైన ఆస్ట్రేలియా, బహామాస్, బార్బడోస్, స్తోనియా, గ్రెనాడా, ఐస్‌ల్యాండ్ న్యూజీల్యాండ్ అనే ఏడు ఏషియానియా దేశాలు మాత్రమే ధూళి కణాల విషయంలో ఆరోగ్యకరమైన స్థాయిని కాపాడుకుంటున్నాయని నివేదిక తెలిపింది. కన్ను పసిగట్టలేనంత సూక్ష్మమైన ఈ ధూళికణాలు అత్యంత ప్రమాదకరమైనవి. నిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల దహనం వల్ల ఇవి వాతావరణంలోకి విడుదల అవుతాయి. వీటివల్ల మనుషుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఇవి కారణమవుతాయనేది తెలిసిందే. ఒక అంచనా ప్రకారం 2021లో 81 లక్షల మంది వాయు కాలుష్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. అందులో 58 శాతం మరణాలకు ధూళికణాలే కారణం. దీన్ని కేవలం ప్రాణనష్టం పరంగా మాత్రమే చూడలేం. ఆరోగ్య సంరక్షణ రంగంపై, తద్వారా ఆర్థిక రంగంపై వేసే ప్రభావం అపారమని గుర్తించాలి. ఇప్పుడే కాలుష్యం ఇంతగా ఉంటే రేపటి రోజున పరిస్థితి ఏమిటనేది ఆందోళన కలిగించక మానదు. పై నివేదిక భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు ఓ మేలుకొలుపు కావాలి. కాలుష్యం అంతానికి ప్రపంచ దేశాలు దృఢదీక్షతో, చేయీ చేయీ కలిపి సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావితరాల కోసమైనా ఆ పని చేయకతప్పదు.
2025-03-12T21:44:53Z