యాదగిరిగుట్ట, జూన్ 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట(పూర్వగిరి) ఆలయంలో ఆదివారం స్వాతీ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతీ నక్షత్రం సందర్భంగా వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో 108 కలశాలు ఏర్పాటు చేసి గంగాది సప్తనదీ జలాలు, మామిడి, తమలపాకులు, దర్భలు, పూలమాలలు, కొబ్బరికాయలతో అలంకరించారు. పంచామృతాలతోపాటు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆయా దేవతల మూలమంత్ర పఠనాలతో హోమ పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభూ పంచనారసింహస్వామి, సువర్ణప్రతిష్ఠ అలంకారమూర్తులను వేదమంత్రాలతో అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించి సువర్ణపుష్పాలతో అర్చించారు.
సాయంత్రం జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా స్వామివారిని దివ్యమనోహరంగా అలంకరించి పూజలు జరిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గిరిప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. గిరిప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలు, బస్టాండ్ ప్రాంతం భక్తులతో నిండిపోయింది. కొండపైన, కింద పా ర్కింగ్‌లో వాహనాలు నిండిపోయాయి. సీసీ కెమెరాల పనితీరు ఆలయ ఈవో వెంకట్రావ్ పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను మానిటరింగ్ సిస్టంలో పరిశీలించి ఆలయ, పోలీసులకు సూచనలు చేశారు.
2025-06-09T00:12:09Z