స్టెరాయిడ్‌ క్రీమ్‌ సురక్షితమేనా?

మా పాప వయసు ఏడు సంవత్సరాలు. తనకు చిన్నప్పడు చర్మం బాగా పొడిగా ఉండేది. దద్దుర్లు ఏర్పడి, ఎర్రగా మారేది. దురదతో బాగా ఇబ్బంది పడేది. డాక్టర్‌కు చూపించాము. కొన్ని క్రీములు రాశారు. అవి రాస్తే కొద్దిగా తగ్గేది. తిరిగి మళ్లీ మొదలయ్యేది. ఆ క్రీములో ఏముందని తెలుసుకుంటే? కొన్ని రకాల స్టెరాయిడ్లతో తయారైనవని తెలిసింది. వీటిని తరచుగా వాడొచ్చా?

పిల్లల్లో ఎగ్జిమా చాలా సాధారణం. ఇది ఒక రకమైన చర్మవ్యాధి. ఇది వస్తే అసౌకర్యంగా ఉంటుంది. చర్మం పొడిగా ఉండేవాళ్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మాయిశ్చరైజర్‌ వాడటమే దీనికి ప్రధానమైన చికిత్స. ఈ సమస్య ఉంటే చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచాలి. చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. కాబట్టి ఈ కాలంలో రోజుకు అయిదారు సార్లు క్రీములు రాయాలి. ఎగ్జిమాతో బాధపడేవారికి తేమ కలిగించేందుకు అందుబాటులో ఉన్న క్రీములు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. దద్దుర్లు, దురద తీవ్రంగా ఉన్నప్పుడు స్టెరాయిడ్‌లు ఉన్న క్రీములు రాయమంటారు. అందుకే క్రీములు కచ్చితంగా డాక్టర్‌ సూచన మేరకే వాడాలి.

క్రీములు కానీ, వాటిని వాడాల్సిన కాలం కూడా డాక్టర్‌ సూచించిన మేరకే ఉండాలి. స్టెరాయిడ్‌ ఉన్న క్రీములు వారాలు, నెలల తరబడి పదేపదే వాడితే, అవి చర్మం ద్వారా శరీరంలో ప్రవేశిస్తాయి. తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. రక్తపోటు పెరుగుతుంది. బరువు పెరుగుతారు. చర్మం పలుచగా మారుతుంది. ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి, చర్మవ్యాధుల వైద్యులు సూచించిన క్రీములు మాత్రమే వాడాలి. దద్దుర్లు వచ్చినప్పుడల్లా స్టెరాయిడ్‌ క్రీములు వాడొద్దు. అంతేకాకుండా డాక్టర్లను మారిస్తే అవగాహన లేక స్టెరాయిడ్లను మళ్లీ మళ్లీ వాడాల్సి రావొచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఒకే డాక్టర్‌కు చూపిస్తూ ఉండాలి. ఇక స్టెరాయిడ్‌ క్రీములు కూడా అవసరం ఉన్నంతవరకు, కొద్దిరోజులు మాత్రమే వాడాలి. అవసరానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

– డాక్టర్‌ విజయానంద్‌

నియోనేటాలజిస్ట్‌ అండ్‌ పీడియాట్రీషియన్‌

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌

2025-02-03T21:24:28Z