ద్రాక్షలంటే ఇష్టమా? అయితే మీరు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే

ద్రాక్షలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలా అని వీటిని మోతాదుకు మించి తింటే.. 

మనలో చాలా మంది ద్రాక్షలను ఇష్టంగా తింటుంటారు. కానీ ద్రాక్షలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి ద్రాక్ష పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే వీటిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

 

ద్రాక్షలో ఎన్నో రకాలు ఉంటాయి. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు వంటి వివిధ రంగుల్లో ద్రాక్షపండ్లు ఉంటాయి. కొన్ని ద్రాక్షల్లో విత్తనాలు కూడా ఉంటాయి. ఎర్ర ద్రాక్షల్లో  రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది హృదయ, అభిజ్ఞా ఆరోగ్యానికి మద్దతునిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ అన్ని రంగుల ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

ఎక్కువ పోషక లక్షణాలు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా వీటిని తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు ద్రాక్షలో ఫైబర్, రాగి, విటమిన్ కె, థయామిన్, రిబోఫ్లేవిన్ , విటమిన్ బి 6, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. 

ద్రాక్షలోని ఆరోగ్య ప్రయోజనాలు

ద్రాక్షలను తినడం వల్ల లాభ నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ద్రాక్ష కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. దీంతో మీ శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 

ద్రాక్షలో ఎన్నో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ద్రాక్షపండ్ల తొక్క, విత్తనాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

ద్రాక్ష పండ్లను మితంగా తీసుకోవడం డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ద్రాక్షపండ్లు మలబద్ధకం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

ద్రాక్ష పండ్లు అతిగా తింటే ఏమవుతుందంటే? 

ద్రాక్ష పండ్లను తింటే మంచే జరుగుతుంది. కానీ వీటిని మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి ద్రాక్ష అలెర్జీ కూడా రావొచ్చు. కొంతమందికి దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 

ద్రాక్షలో విటమిన్ కె ఉంటుంది. ఇవి శరీరంలో వార్ఫరిన్ వంటి రక్తం గడ్డకట్టే ఏజెంట్లు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ద్రాక్షలు తినడం మానేయాలని నిపుణులు అంటున్నారు. ద్రాక్ష వంటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ద్రాక్షపండ్లను మధ్యాహ్నం అల్పాహారంగా కూడా తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

2023-06-08T08:36:18Z dg43tfdfdgfd