రాజన్న ఆలయంలో కనుల పండువలా శ్రీరామ నవరాత్రోత్సవాలు..

రిపోర్టర్ : హరిబాబు

లొకేషన్ : వేములవాడ

దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ (Vemulawada) శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో తొమ్మిది రోజులపాటు శ్రీరామనవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధానార్చకులు అప్పాల భీమా శంకర శర్మ ఆధ్వర్యంలో 11 మంది అర్చకులు, వేద పండితులు విశేష పూజలు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నారు. 28వ తేదీ నుండి 30 వరకు 3 రోజుల పాటు భక్తోత్సవం, హవన పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. 30 గురువారం రోజున ఉదయం 11:59 నిమిషాల నుండి శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవం (భక్తోత్సవము) నిర్వహించబడునని, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి, సాయంత్రం రథోత్సవం.. అనంతరం రాత్రి డోలోత్సవం (వసంతోత్సవం)తో సీతారామ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తాయని అర్చకులు, వేద పండితులు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల్లో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయామానంగా అలంకరించారు. దీంతో ఆలయం ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తోంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఉదయం రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనుబంధ దేవాలయాల్లో సైతం ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు.

తొమ్మిది రోజులపాటు ఉదయం మహాగణపతికి అభిషేక పూజలు, పరివార దేవతలకు సైతం విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు గోపన్నగారి శివ తెలిపారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ప్రతి ఏటా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని హరిహర క్షేత్రం, భాస్కర క్షేత్రంగా కూడా పిలుస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు స్వామివార్లు సాయంత్రం వివిధ వాహనాలపై పట్టణ పురవీధుల గుండా విహరిస్తూ.. భక్తులకు, పట్టణ ప్రజలకు దర్శనమిస్తున్నారు.

2023-03-25T16:15:38Z dg43tfdfdgfd