వయస్సు 6.. డ్రాయింగ్‌ 10 అడుగులు

  • మహాత్ముడి పెయింటింగ్‌ వేసిన బుడతడు

మియాపూర్‌ , అక్టోబర్‌ 1 : ఆరేండ్ల చిన్నారి అద్భుతమైన చిత్రకళతో భళా అనిపించాడు. తన ఎత్తు మూడున్నర అడుగులైనా.. పది అడుగుల మేర మహాత్ముడి చిత్రాన్ని కేవలం 2 గంటల వ్యవధిలో గీసి తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు. ఫలితంగా విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌ సాధించాడు. హైదర్‌నగర్‌ డివిజన్‌ నిజాంపేట రోడ్డుకు చెందిన ఆరేండ్ల హెచ్‌బీ హనుచరణ్‌ స్థానిక సంఘమిత్ర పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని తన నివాసంలో పది అడుగుల ఎత్తు, 7.6 అడుగుల వెడల్పున్న గాంధీ చిత్రాన్ని రెండు గంటల వ్యవధిలో గీశాడు. చిన్నారి హనుచరణ్‌ అద్భుత ప్రతిభను చాటుకున్నట్లు విద్యార్థి డ్రాయింగ్‌ గురువు సత్యవోలు రాంబాబు తెలిపారు. ఈ విద్యార్థి ప్రతిభను గుర్తించిన విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ అవార్డును ప్రకటిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి డాక్టర్‌ ఎంఆర్‌ఎస్‌ రాజు తెలిపారు. మూడేండ్ల ప్రాయం నుంచే చిత్రకళపై చిన్నారికి ఉన్న ఆసక్తిని గుర్తించి తగిన శిక్షణను ఇప్పిస్తున్నట్లు హనుచరణ్‌ తల్లిదండ్రులు మౌనిక, సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, గంగాధర్‌, మాధవి తదితరులు పాల్గొన్నారు.

2023-10-01T20:06:06Z dg43tfdfdgfd