వైభవ యాదగిరికి ఏడాది

  • గుట్టలో 1.10 కోట్ల మందికి దర్శనభాగ్యం
  • పోటెత్తుతున్న భక్తజనం.. పెరిగిన ఆదాయం

యాదగిరిగుట్ట, మార్చి 27: యాదగిరిగుట్టలోని స్వయంభూ లక్ష్మీనరసింహుడి ప్రధానాలయ పునఃప్రారంభానికి సోమవారం నాటితో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది సమయంలో స్వామివారిని 1.10 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఒకప్పుడు ఏడాదికి 10 లక్షలు కూడా భక్తుల సంఖ్య దాటలేదు. నిరుడు మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ఆలయ పునఃప్రారంభమైన తర్వాత నుంచి ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నది.

2018-19లో రూ.99 కోట్ల పైచిలుకు ఆదా యం రాగా, 2020-21 సంవత్సరంలో రూ.125 కోట్ల పైగానే సమకూరింది. ఇతర విభాగాలతోపాటు శాశ్వత పూజలు, అన్నదానంపై నిరుడు మార్చి 28 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు రూ.180,96,21,812 ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం రెండింతలు పెరిగింది. రెండేండ్ల క్రితం హుండీ ఆదాయం రూ.10 కోట్లు ఉండగా, నిరుడు రూ.12 కోట్లు వచ్చింది. ఆలయ పునఃప్రారంభానంతరం .30,03,78,420 నగదు, మిశ్రమ వెండి 48.9360 కిలోలు, మిశ్రమ బంగారం 2,62 9 గ్రాములు సమకూరింది. విదేశీ పర్యాటకుల రాక కూడా పెరిగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా విదేశీ కరెన్సీ భారీగా వస్తున్నది.

త్వరలో స్వామివారికి కోటి కుంకుమార్చన

సీఎం కేసీఆర్‌ అనుమతితో త్వరలో స్వామివారికి కోటి కుంకుమార్చన, మహా యాగాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత, ప్రధానార్చకుడు నల్లంథీగళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. భక్తులు ఆలయ నిర్మాణాలు చూసి సీఎం కేసీఆర్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారన్నారు.

2023-03-27T22:40:32Z dg43tfdfdgfd