కొడుకు పెళ్లి చూడకుండానే కన్నుమూసిన తండ్రి.. భౌతికకాయం ముందే తాళికట్టి కోరిక తీర్చిన యువకుడు

కుమారుడికి పెళ్లి చేసి ఓ ఇంటివాడైతే చూడాలనేది కన్నతండ్రి కోరిక. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండటంతో కొడుక్కి తొందరగా పెళ్లిచేయాలని భావించాడు. దీంతో ఓ సంబంధం ఖాయం చేసి.. పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఆ కోరిక తీరకముందే ఆయన అనంతలోకాలకు వెళ్లిపోయాడు. తన పెళ్లి చూడకుండానే కన్నతండ్రి కన్నుమూయడం ఆ కుమారుడికి తీరని వేదన మిగిల్చింది. తన పెళ్లికి మరో నాలుగు రోజులు ఉండగానే ఆయన శాశ్వతంగా దూరమవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. తన పెళ్లి చూడాలన్న తండ్రి కోరికను ఎలాగైనా నెరవేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. దీంతో ఆయన భౌతికకాయం ముందే యువతిని పెళ్లి చేసుకున్నాడు.

తండ్రిపై తనకున్న ప్రేమను కుమారుడు ఇలా చాటుకుని, ఆ కోరిక తీర్చాడు. గుండెల్ని పిండేసే ఈ ఘటన తమిళనాడులోని కళ్లక్కురిచ్చిలో చోటుచేసుకుంది. కళ్లక్కురిచ్చి సమీపం పెరువంగూర్‌ గ్రామానికి చెందిన పంచాయతీ యూనియన్‌ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్‌ కుమారుడు ప్రవీణ్‌కు పెళ్లి నిశ్చయమైంది. మార్చి 27న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అయితే, భర్త రాజేంద్రన్‌ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశాడు. కొడుకు పెళ్లికి కొద్ది రోజుల ముందే ఆయన చనిపోవడంతో కుటుంబం విషాదంలో నెలకుంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా జరగడం.. తండ్రి తన పెళ్లి చూడకుండా కన్నుమాయడం ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు.

ఈ నేపథ్యంలో రాజేంద్రన్‌ అంత్యక్రియలకు చెన్నైకి చెందిన వధువు స్వర్ణమాల్య, ఆమె కుటుంబం హాజరయ్యింది. తన పెళ్లి చూడాలనే తండ్రి కోరికను ఎలాగైనా నెరవేర్చాలని ప్రవీణ భావించాడు. దీంతో ఆయన భౌతికకాయం సమక్షంలోనే పెళ్లి చేసుకుందామని వధువు స్వర్ణమాల్యను కోరారు. ఇందుకు ఆమె కూడా అంగీకరించడంతో రాజేంద్రన్ భౌతికకాయం ఎదుటే పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆయన భౌతికకాయానికి నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. తండ్రిపై కుమారుడికి ఉన్న ప్రేమకు నిదర్శనమని ప్రవీణ్‌పై ప్రశంసలు కురిపించారు.

Read More Latest National News And Telugu News

2023-03-22T02:50:59Z dg43tfdfdgfd