‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. మనిషి పుట్టుకతో ఏదైనా అవయవ లోపం ఏర్పడితే బతుకడానికి ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కండ్లు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే. మానవ శరీరంలో అత్యంత విలువైన, సున్నితమైన అవయవం కన్ను. మానవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడంటే దానికి కారణం కండ్లు. అవి మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కండ్లు లేనివారు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవడం బాధాకరమైన విషయం.
‘మనిషికి వైకల్యమున్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు’ అం టారు. మనోైస్థెర్యం ఉన్నవారు శరీర వైకల్యాన్ని అధిగమించడమే గాక ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఇది అక్షరాలా నిజం. అలాంటి స్ఫూర్తిమంతమైన అంధురాలి యదార్థ జీవిత గాథ ఇది. ఆమె పేరు పయ్యావుల కొమురమ్మ. ఆమె పుట్టుకతోనే అంధురాలు. అయితేనేం తన పనులు తానే చేసుకుంటూ ఎంతోమంది దివ్యాంగులకు, యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నది.
కొమురమ్మది సూర్యాపేట జిల్లాలోని మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లి. ఆమె నిరుపేద యాదవ కుటుంబానికి చెందిన బొర్రయ్య, ముత్తమ్మ దంపతులకు జన్మించింది. ఆమె జన్మతః అంధురాలు కావడం వల్ల సవాలక్ష సవాళ్లు ఎదుర్కొన్నది. జీవితంలో ఏ పనిచేయలేని కొమురమ్మకు తల్లి ముత్తమ్మనే తొలి గురువు. ప్రపంచంలోని అమ్మలందరికీ పిల్లలపై ఆకాశమంత ప్రేమ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ముత్తమ్మకు బిడ్డ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ. అంధకారం అలుముకున్న తన బిడ్డ జీవితాన్ని చూసి ఆ తల్లి రోధించిన సందర్భాలెన్నో. కొమురమ్మను అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కానీ అది అంధుల పాఠశాల కాకపోవడంతో ఆమె గురువులు చెప్పే పాఠాలు సరిగా అర్థం చేసుకోలేకపోయేది. చుట్టుపక్కల ఎక్కడా అంధుల పాఠశాలలు లేకపోవటంతో ఆమె ఇంటికే పరిమితమైంది.
తల్లి కూలీ, పొలం పనుల కోసం ఎక్కడికి వెళ్లినా కొమురమ్మను తనవెంటే తీసుకుకెళ్లేది. అంతేగాక తల్లి మాట్లాడే బంధుత్వ వరుసలను , మాట్లాడే విధానాన్ని గమనించేది. అలా తోటివారిని గుర్తించడం నేర్చుకున్నది. రూపం కనిపించకపోయినా ప్రతి ఒక్కరి గొం తును గుర్తుంచుకునేది. ఎవరైనా ఇంటి కి వస్తే వారి మాట విని వారి పేరు వెం టనే చెప్పేంత జ్ఞాపకశక్తిని కొముర మ్మ సొంతం చేసుకున్నది.
మానవత్వానికి మరో పేరు పయ్యావుల ముత్తమ్మ. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనసు ఆమెది. మొదట బిడ్డ జీవితం చూసి చలించిపోయేది. ఆమె మంచి భవిష్య త్తు కోసం తపించేది. బిడ్డ ఎదిగేకొద్దీ ఆమె కష్టసుఖాలను ఎవరు చూసుకుంటారనే బెంగపట్టుకున్నది. ‘తాను ఆరోగ్యంగా ఉన్నంతవరకు బిడ్డను చూసుకుంటాను కానీ తన తర్వాత బిడ్డ ఎవరిపై ఆధారపడకుండా ఎలా బతుకుతుందనే ఆలోచన ఆమెను వెంటాడింది. ముత్తమ్మ కు అక్షరజ్ఞానం లేకపోయినా ముందుచూపుతో తన బిడ్డకు అందరిలాగే వంట, ఇంటి పనులు చేసుకోవటంలో శిక్షణనిచ్చింది. తల్లి చెప్పినట్టే కొమురమ్మ శ్రద్ధగా వింటూ ఓపికగా నేర్చుకున్నది. అలా కొమురమ్మ జీవితం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది.
పనులు నేర్పించడమే గాక ఊరిలో ఎవరింటికి ఎలా వెళ్లాలో వెంట తీసుకెళ్లి చూపించేది. తల్లి చూపించిన ఇంటి దూరాన్ని అడుగుల లెక్క, సమయాన్ని బట్టి గుర్తుంచుకున్నది. అలా చూసేవారికి కండ్లు లేవంటే నమ్మలేని ఆశ్చర్యం, అనుమానం కూడా వారికి కలిగేది. అలా ఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
తల్లి ముత్తమ్మ తన బిడ్డ కొమురమ్మను 43 ఏండ్ల వయస్సు వరకు అన్నీతానై దగ్గరుండి చూసుకున్నది. ఆ తర్వాత అనుకోకుండా తీవ్ర అనారోగ్యంతో తల్లి మరణించింది. తల్లి మరణ వార్త విన్న కొమురమ్మ కన్నీరుమున్నీరైంది. ఆ సంఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిన సందర్భం.. తల్లి మరణాంతరం తండ్రి (బొర్రయ్య) కూడా అనారోగ్యానికి గురైయ్యా డు. కండ్లు లేనప్పటికీ కొమురమ్మ తన తండ్రికి అన్నీతానై సేవలు చేసింది. కండ్లు లేవని ఆమె కలత చెందలేదు. తనకు భవిష్యత్తు లేదని ఆగిపోలేదు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముం దుకుసాగింది.
నిరు పేదరాలైన కొమురమ్మకు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. పాత మట్టిగోడల మధ్యే ఆమె నివాసం. అయినా తన జీవితాన్ని ఆ గోడల మధ్యే సాగిస్తున్నది. అం ధురాలైన కొమురమ్మకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఒక మార్గా న్ని చూపాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
అవయవాలు సరిగా ఉండి పనిచేయటానికి బద్ధకిస్తున్నవారు కొమురమ్మను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. ఆమె జీవితం నేటి యువతకు ఆదర్శం.
కోట దామోదర్: 93914 80475
2023-03-27T19:40:27Z dg43tfdfdgfd