ALOO BHUJIA: బంగాళాదుంపతో కరకరలాడే కారప్పూస.. పుల్ల పుల్లగా కారం కారంగా హెల్తీ స్నాక్

ఆలూ భుజియా అనేది బంగాళాదుంపలతో తయారుచేసే ఒక ప్రసిద్ధ భారతీయ స్నాక్. ఇది కారప్పూస లాగా సన్నగా, కరకరలాడుతూ ఉంటుంది. సాధారణంగా స్నాక్స్‌గా, టీతో పాటు లేదా వివిధ వంటకాలపై టాపింగ్‌గా దీన్ని తింటారు. మార్కెట్‌లో ప్యాకెట్లలో లభ్యమైనా, ఇంట్లో కూడా సులభంగా, పరిశుభ్రంగా తయారు చేసుకోవచ్చు. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టపడే ఈ స్నాక్ ఐటెంను ఒక్కసారి తిన్నారంటే ప్లేటు ఖాళీ చేయడం ఖాయం.

ఆలూ భుజియా తయారీకి కావలసిన పదార్థాలు:

బంగాళాదుంపలు

శనగపిండి

ఉప్పు (రుచికి సరిపడా)

కారప్పొడి

ఆమ్‌చూర్ పొడి

గరం మసాలా

చాట్ మసాలా

ఇంగువ (చిటికెడు)

నూనె (డీప్ ఫ్రై కోసం)

ఆలూ భుజియా తయారీ విధానం:

బంగాళాదుంపల తయారీ:

ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అవి చల్లారాక తొక్క తీసి, ముక్కలు లేకుండా మెత్తని పేస్ట్‌లా మెదుపుకోవాలి.

పిండి తయారీ: ఒక పెద్ద గిన్నెలో శనగపిండి తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఇంగువ వేసి బాగా కలపాలి.

కలపడం: ఇప్పుడు మసాలాలు కలిపిన శనగపిండిని మెత్తగా మెదిపిన బంగాళాదుంపల పేస్ట్‌లోకి వేసి, అన్నీ బాగా కలిసేలా ముద్దగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం పొడిగా అనిపించినా, నీళ్లు వెంటనే కలపకూడదు. పిండిని కలుపుతూ ఉంటే అది మెత్తబడుతుంది. ఒకవేళ అవసరమైతే, కొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకోవచ్చు.

వేయించడం: డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. జంతికలు ఒత్తుకునే మెషీన్‌కు లోపలి వైపు నూనె రాసి, సన్నని బిళ్ళ (సేవ్ అచ్చు) పెట్టి, తయారు చేసుకున్న పిండిని అందులో నింపాలి.

నూనె బాగా వేడెక్కాక, మెషీన్‌తో నేరుగా నూనెలోకి సన్నని సేవ్‌లా ఒత్తుకోవాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేసి, నూనెలోంచి తీసేయాలి. అంతే, కరకరలాడే రుచికరమైన ఆలూ భుజియా సిద్ధం. దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ స్నాక్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

2025-06-09T15:10:44Z