లక్నో: ఒక మద్యం విక్రేత బీరు (beer)పై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నాడు. ఈ విషయం ఎక్సైజ్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధిక ధరకు బీరు అమ్మిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మద్యం షాపు యాజమానికి రూ.75,000 జరిమానా విధించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బిస్రాఖ్లోని రోజా జలాల్పూర్ ప్రాంతానికి చెందిన మద్యం విక్రేత రవి సింగ్, అధిక ధరలకు లిక్కర్ అమ్ముతున్నాడు. 500 మిల్లీలీటర్ల కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ బీర్ ధర రూ.120 ఉండగా కస్టమర్ల నుంచి రూ.130- రూ.140 వరకు వసూలు చేస్తున్నాడు.
కాగా, పలువురు కస్టమర్లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి రంగంలోకి దిగారు. ఆ మద్యం షాపు నుంచి ఒక కస్టమర్‌తో లిక్కర్ కొనుగోలు చేయించారు. అధిక ధరలకు మద్యం అమ్ముతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం జైలుకు తరలించారు.
మరోవైపు లైసెన్స్ కలిగిన మద్యం షాపు యజమానికి రూ.75,000 జరిమానా విధించినట్లు ఎక్సైజ్ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం అధిక ధరలకు మద్యం అమ్మితే మొదటిసారి జరిమానా రూ.75,000, రెండోసారి రూ.1.5 లక్షలు విధిస్తామని చెప్పారు. మూడోసారి కూడా ఇలా జరిగితే మద్యం షాపు లైసెన్స్‌ను ఎక్సైజ్ శాఖ రద్దు చేస్తుందని వెల్లడించారు.
2023-03-26T14:01:25Z dg43tfdfdgfd