Children Stories | ఒక ఊళ్లె ఇద్దరు ఆలుమొగలు ఉండెటోళ్లు. పెండ్లాం జరంత ఇకమతు ఉన్నామెనే. కనీ.. పెనిమిటి అట్టి అమాయకుడు. పరమానందయ్య శిష్యులసోంటోడు. ‘ఉన్నవా అంటే.. ఉన్నట్టే!’ దప్ప.. ఏం దెల్వని పిసోడు. పాపం, ఆమెనే ఎట్లనో ఒల్లు సవరిచ్చుకత్తంది. ఈని పిసతనాన్ని సవరియ్యక.. పనిచ్చినోళ్లు అందరు పరేషానయ్యేటోళ్లు. ఒక్కపారి పనిచ్చినోడు మల్ల దగ్గరికి రానిచ్చేది గాదు. ఈని అమాయకం అందరికీ మూడుకత్తుండె. ఇగ ఇట్లయితే గాదని.. పెనిమిటిని ఇంట్లుంచి పెండ్లామే పనికి వోతుండె. పని దొర్కన్నాడు.. అడివికి వోయి కట్టెలు గొట్టుకచ్చి సంతల అమ్ముతుండె.
ఆమె ఒకపారి ఎప్పటితీర్గనే కట్టెలుదేను అడివికి వోయింది. ఎండిన శెట్టు జూసి కొడుదామని దగ్గరికి వోంగనే.. ఆ శెట్టు తొర్రల ఒక ముల్లె కానచ్చింది. ముల్లె ఇప్పి సూడంగనే కండ్లకు నమ్మకం గాలే. అండ్ల బంగారం, అజ్రాలు, ముత్యాలు, పగుడాలు ఉన్నయి. అటీటు సూశింది. ఆడ ఎవ్వలు గనిపియ్యలే. దేవుడిచ్చిండనుకుని ముల్లె దీస్కోని ఇంటికి వోయింది. మొగనికి సూయించి.. “ఇవ్వి అమ్ముకుని ఏదన్న పని వెట్టుకుంటె మన దరిద్రమంత వోద్ది!” అని జెప్పి, ముల్లెను దాశి పెట్టింది. “అట్లనే!” అన్నడాయినె. నడిరాత్రి ఆమెకు తెలివైంది. ‘ఈ ముచ్చట ఎట్లనన్న అందరికి ఎరుకైద్ది.. పిసోడు ఎవలకన్న శెప్పక వోడు’ అనుకుంది. ఎట్లనన్న ఇకమతు జేయాలని సోచాయించింది. శిటుక్కున నిద్రవోతున్న మొగన్ని లేపింది. “ఏమయ్యో! ఏం మొద్దు నిద్రవోతున్నవ్ లెవ్వు! అగో సప్పుడు ఇనత్తందా..? ఆకిట్ల లడ్డూల ఆన వడ్తాంది” అని జెప్పింది. కడుపునిండ దిని పనీపాట లేక పన్నడాయె. నిద్ర మబ్బుల్నే.. “సరే.. అట్లనే” అనుకుంట గుర్రువెట్టి మల్ల నిద్రవోయిండు.
రోజులు గడువవట్టె.. ఈల్లు నగలమ్ముకుంట బతకవట్టిండ్లు. అయినా అనుమానం రావద్దని ఎప్పటోలె ఆమె అడివికి వోయి.. కట్టెలు దెత్తనే ఉన్నది. అయినా సుట్టుపక్కోల్లకు ఈ ఇద్దరాలు మొగల మీద అనుమానం అచ్చింది. ఆమె ఎట్లన్నా జెప్పదని ఎర్కనేనాయె! ఆమె ఇంట్ల లేంది జూశి.. సుట్టుపక్కోల్లు ఆనితోని మాట ముచ్చట గలిపిండ్లు. “మునుపటి కంటె మంచిగ బతుకుతాండ్లు! పైసలు ఎక్కడియి!” అంట అడిగిండ్లు. దానికాడు.. “మాకు అడివిల బంగారం ముల్లె దొరికింది. అండ్లకెల్లి అమ్ముకుంటున్నం” అని జెప్పిండు. అసలు ముచ్చట ఎరుకై.. అందరు ఆశ్చర్యంల వడ్డరు. “ఆ ముల్లె ఎప్పుడు దొరికింది” అంట మల్ల అడిగిండ్లు. మస్తు సేపు యాజ్జేసుకోంగ యాదికచ్చింది. ఎంటనే.. “ఆ యాది కచ్చింది. మాకు లడ్డూలు దొర్కిన్నాడు.. నడిమి రాత్రి లడ్డూల ఆన వడ్డది. ఆనాడె దొర్కినయ్” అంట జెప్పిండు. ఆని ముచ్చటిన్నోల్లు.. ‘నగల్లేవు, గిగల్లేవు.. పిసోడు!’ అనుకుని నవ్వుకుంట ఎల్లిపేయిండ్లు. ముందుగాల్నె జాగర్త వడ్డందుకు.. ముచ్చట దెలిశిన పెండ్లాం పానం కూనం వడ్డది.
… పత్తిపాక మోహన్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
2023-03-26T01:17:50Z dg43tfdfdgfd