FEMALE CONDOM GUIDE: అమ్మాయిలు కండోమ్ ఎలా వాడాలి? అదెలా ఉంటుంది? లాభ నష్టాలేంటి? అన్నీ వివరంగా తెల్సుకోండి

కండోమ్ అంటే అబ్బాయిలకే అనే ఆలోచన అందరిలోనూ ముద్రేసుకుని కూర్చుంది. అమ్మాయిల కోసం కూడా ప్రత్యేకంగా ఫీమేల్ కండోమ్స్ ఉంటాయని చాలా తక్కువ మందికే తెలిసిన విషయం. వీటి వాడకం ప్రతి అమ్మాయికి తెలిసుండాలి కూడా. మీ భాగస్వామికి కండోమ్ వాడటంలో అసౌకర్యం ఉన్నా, మీరే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడాలన్నా.. ఈ ఫీమేల్ కండోమ్స్ వాడొచ్చు. ఎదుటి వ్యక్తి మీద నమ్మకం లేకపోయినా, వాళ్లకు అసౌకర్యం ఉన్నా మీరే ముందు జాగ్రత్త పడొచ్చు. వీటి గురించి పూర్తి విషయాలు, అపోహలు, వాస్తవాలు, లాభ నష్టాలు తెల్సుకుందాం.

ఫీమేల్ కండోమ్స్:

ఫీమేల్ కండోమ్స్ లేటెక్స్‌తో కాకుండా నైట్రైల్ వాడి చేస్తారు. ఇది లేటెక్స్ లేని రబ్బర్ రకం. చాలా మందికి లేటెక్స్ వల్ల ఎలర్జీలు వస్తాయి. అబ్బాయిలు, అమ్మాయిల్లోనూ పురుషుల కండోమ్స్‌లో ఉండే లేటెక్స్ పడక యోనిలో మంట, అసౌకర్యం, ర్యాషెస్ వస్తాయి. వీటితో ఆ ఇబ్బంది ఉండదు.

ఫీమేల్ కండోమ్ ఎలా వాడాలి?

ట్యాంపన్లు వాడే అలవాటున్న వాళ్లకి ఇది వాడటం మరింత సులువు. రెండు మూడు సార్లు వాడితే ఎవరికైనా సులువుగా అలవాటయిపోతుంది. దీన్నెలా వాడాలో వివరంగా చూడండి.

  1. మేల్ కండోమ్ లాగా దీన్ని కలయిక సమయంలోనే పెట్టుకోనక్కర్లేదు. దీన్ని ముందుగానే లోపల పెట్టేసుకోవచ్చు. కనీసం ఎనిమిది గంటలైనా దీన్ని పెట్టుకుని ఉండొచ్చు. దాంతో లైంగిక కలయికకు మధ్యలో ఆటంకం ఉండదు. అలాగే కలయిక తర్వాత కూడా వెంటనే దీన్ని తీసేయాల్సిన అవసరం లేదు.
  2. ఫీమేల్ కండోమ్‌కు రెండు రింగులుంటాయి. ఒక రింగ్ యోని లోపల ఉంటే, మరోటి యోని బయట ఉంటుంది.
  3. కండోమ్ మూసి ఉన్న వైపు చివర లూబ్రికెంట్ రాసి, అదే వైపున్న రింగును చేత్తో పట్టుకుని కాస్త నొక్కినట్లు చేసి యోనిలోకి చొప్పించాలి. లోపలికి దూర్చాక వదిలేయాలి. మరో రింగ్ యోని బయటే ఉంటుంది.
  4. దానికోసం మీకు సౌకర్యం ఉన్న స్థితిలో కూర్చోవాలి. స్క్వాట్స్ చేసున్నట్లు, లేదంటే పడుకుని, నిలబడి పెట్టుకోవచ్చు దీన్ని.

వీటివల్ల మేల్ కండోమ్ లాంటి లాభాలుంటాయా?

సరిగ్గా వాడితే పూర్తి ప్రయోజనాలు పొందొచ్చు. ఇవి ప్రెగ్నెన్సీ, లైంగికపరంగా వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా 95 శాతం వరకు కాపాడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. భాగస్వామికి మేల్ కండోమ్ వాడటం ఇష్టం లేకపోతే మీరు దీన్ని ఎంచుకోవచ్చు. అలాంటి ఫలితాలే దీంతోనూ పొందొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ, ప్రసవం తర్వాత, పీరియడ్స్ సమయంలోనూ దీన్ని వాడొచ్చు.

కొన్ని నష్టాలుంటాయి:

  1. మేల్ కండోమ్స్ కన్నా వీటి ధర కాస్త ఎక్కువ.
  2. మన దేశంలో అన్ని సైజుల్లో ఇవి అందుబాటులో లేవు.
  3. వీటిని వాడాలంటే లూబ్రికేషన్ కాస్త ఎక్కువ అవసరం.
  4. కొంతమంది మహిళల్లో వీటివల్ల అసౌకర్యం ఉండొచ్చు.
  5. మేల్ కండోమ్స్ లాగా ఇవి సులభంగా అన్ని చోట్ల దొరకడం కష్టమే.
  6. కొంతమందికి దీనివల్ల శృంగారంలో తక్కువ అనుభూతి కలుగుతుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి:

  1. మేల్ కండోమ్ , ఫీమేల్ కండోమ్ రెండూ ఒకేసారి వాడకూడదు. వాటివల్ల రాపిడి ఎక్కువవుతుంది. అసౌకర్యం ఉండొచ్చు. నొప్పి ఉండొచ్చు.
  2. పీమేల్ కండోమ్ చిరిగిపోయినట్లు అనిపిస్తే వెంటనే తీసేయడం మర్చిపోవద్దు.
  3. ట్యాంపన్లు, మెన్‌స్ట్రువల్ కప్స్ వాడితే వీటిని పెట్టుకునే ముందు తీసేయాలి.
  4. శృంగారం తర్వాత వెంటనే వీటిని తీసేయాల్సిన అవసరం లేదు. కానీ పూర్తి ఫలితం కోసం తీసేయడం మంచిదే.

2024-09-04T14:55:28Z dg43tfdfdgfd