FISH FOOD FESTIVAL | రండి వంటకాలు రుచి చూడండి..! నగర వాసులకు మంత్రి తలసాని పిలుపు

Fish Food Festival | తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాల్స్‌ను పరిశీలించి రొయ్యల ఫ్రై, బిర్యానీ, పకోడి, పులుసు తదితర వంటకాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంతో రుచికరమైన వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ ఫెస్టివల్‌ను సందర్శించి వంటకాలను రుచి చూసి.. ఆదరించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది కుటుంబాలలో వెలుగులు తేవాలనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా మత్స్య కారులు ఆర్థిక స్వావలంబన సాధించేలా తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. మృగశిర కార్తె సందర్భంగా మహిళా మత్స్యకారులు చేపలు, రొయ్యలతో చేసే వివిధ రకాల వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచనతో సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సుమారు 800 స్టాల్స్‌ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు.

వీటిని రానున్న రోజుల్లో 2వేల వరకు పెంచనున్నట్లు వివరించారు. ఇప్పటికే మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 600 మంది మహిళా మత్స్యకారులకు వివిధ రకాల వంటకాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా నూతనంగా నిర్మించనున్న చేపల మార్కెట్‌లో మహిళలకే అధిక స్టాల్స్ కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ని వివిధ సొసైటీలలో నూతనంగా 18 సంవత్సరాలు నిండిన అర్హులైన లక్ష మంది మత్స్యకారులకు సభ్యత్వాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన మత్స్యకార యువతకు వంటకాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మత్స్య శాఖ అధికారులు మురళి, సుధాకర్, చరితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2023-06-08T14:35:44Z dg43tfdfdgfd