Fish Iguru: చేపలంటే మీకు ఇష్టమా? ఎప్పుడూ చేపల పులుసే తింటే ఎలా? ఓసారి స్పైసీ చేపల ఇగురు తినండి. దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఇగురు వేసుకుని, పక్కన చేప ముక్క పెట్టుకుని తింటే ఆ రుచే వేరు. చేపల ఇగురు ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు టేస్టీ చేపల ఇగురు ఇట్టే చేసేయగలరు.
చేప ముక్కలు - కిలో
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
అల్లం తురుము - రెండు స్పూన్లు
కారం - టీ స్పూను
ఎండు మిర్చి - నాలుగు
పసుపు - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
నూనె - తగినంత
బిర్యానీ ఆకులు - రెండు
1. చేపల ఇగురు చేయడానికి ముందుగా చేపల ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ పెనం పెట్టి కాస్త నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక చేప ముక్కలు వేసి రెండు వైపులా వేయించాలి.
3. ఆ చేప ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
4. మిక్సీ జార్లో ధనియాలు, అల్లం తురుము, పసుపు, కారం, ఉప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
5. స్టవ్ మీద కళాయిని పెట్టి నూనె వేయాలి.
6. నూనె వేడెక్కాక జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి.
7. తరువాత బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
8. ఇవి వేగాక ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇదంతా ఇగురులా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలను వేయాలి.
10. చేపలు ఉడకడానికి చిన్న గ్లాసుతో నీళ్లు పోయాలి.
11. పచ్చిమిర్చిని నిలువుగా కోసి వేయాలి.
12. చిన్న మంట మీద ఇగురులా అయ్యేవరకు ఉడికించాలి. నూనె పైకి తేలుతుందంటే ఇగురు రెడీ అయినట్టే. పైన కొత్తిమీర చల్లుకోవాలి.
చేపల ఇగురు చేయడం అందరికీ కుదరదు. పులుసులా చేసేస్తూ ఉంటారు. ఇగురులా చేస్తే రుచి అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మేం చెప్పిన పద్ధతిలో రెసిపీ వండుకుని చూడండి. మీకు నచ్చడం ఖాయం.
2024-09-05T06:55:48Z dg43tfdfdgfd