MILKSHAKE: భోజనం తినాలనిపించకపోతే ఈ మిల్క్‌షేక్ ఒక గ్లాసుడు తాగండి చాలు, అన్ని పోషకాలూ అందుతాయి

Milk Shake: ఆకలి వేస్తున్నా ఒకోసారి భోజనం తినాలనిపించదు. అలాంటప్పుడు ప్రోటీన్ లోపం, పోషకాహార లోపం రాకుండా మిల్క్ షేక్‌లను తయారు చేసుకొని తాగండి. ఏ మిల్క్‌ షేక్ పడితే ఆ మిల్క్ షేక్ తాగితే పోషకాలు అందవు. ఇక్కడ మేము ఇచ్చిన మిల్క్ షేక్ లను అప్పుడప్పుడు భోజనం తినాలనిపించనప్పుడు తాగితే ఆ పూట ఎలాంటి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. వీటిని చేయడం చాలా సులువు. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తాగుతారు.

ఈ కాలంలో పగలు, రాత్రి కష్టపడి పని చేస్తేనే సంపాదించే పరిస్థితి. ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన భోజనం చేయడానికి వండడానికి సమయం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి భోజనం వేళ అవుతున్నా కూడా సమయం లేక తినడం మానేసేవారు ఎంతోమంది. మరి కొందరికి పని ఒత్తిడి వల్ల భోజనం తినే తీరిక ఉండదు. అలాంటి వారు ఇక్కడ ఇచ్చిన మిల్క్ షేక్‌లలో ఏదో ఒకటి చేసుకొని తాగేయండి. ఈ భోజనం తిన్నంత ఫలితాన్ని ఇస్తుంది. పొట్ట నిండినట్టుగా ఉంటుంది. ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. ప్రోటీన్ కూడా ఈ మిల్క్ షేక్‌లలో అధికంగా ఉంటుంది. వీటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

బనానా పీనట్ బటర్ షేక్

ఈ మిల్క్ షేక్ ఒక క్లాసిక్ కాంబినేషన్ కలిగి ఉంది. దీన్ని పోషకాల పవర్ హౌస్ అని చెప్పవచ్చు. అరటి పండ్లు సహజంగానే తీయగా ఉంటాయి. వీటిలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడే గుణం ఉంటుంది. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పీనట్ బటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఒక పండిన అరటిపండు, ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ఒక కప్పు పాలు, కొన్ని ఓట్స్ వేసి బ్లెండర్లో మిల్క్ షేక్‌లా చేయాలి. దీన్ని తాగితే ఆకలి వేయదు.

మామిడి కొబ్బరి షేక్

మామిడిపండు కాలం అయిపోయింది. మళ్లీ వచ్చే సమయానికి ఈ మామిడిపండు కొబ్బరి షేక్ ఎలా చేయాలో గుర్తుంచుకోండి. మామిడిపండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఎంతో ముఖ్యమైనవి ఇవి. ఇక కొబ్బరి పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. కొబ్బరి పాలు కొంచెం తాగితే చాలు పొట్ట నిండుగా అనిపిస్తుంది. కాబట్టి మామిడి కొబ్బరి షేక్ చేయడానికి ఒక కప్పు మామిడికాయ పండు ముక్కలను తీసుకోవాలి. బ్లెండర్లో ఈ మామిడిపండు ముక్కల్ని, కొబ్బరిపాలను వేయాలి. ఒక స్పూన్ చియా గింజలను కూడా వేయాలి. ఒక అర స్పూను నిమ్మరసం కూడా వేసి బ్లెండ్ చేయాలి. ఇది చాలా రిఫ్రెష్మెంట్ గా అనిపిస్తుంది. టేస్టీగా తాగాలనిపించేలా ఉంటుంది.

బెర్రీ ప్రోటీన్ షేక్

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, రాస్పెబెర్రీలు... ఇలా బెర్రీ కుటుంబానికి చెందిన ఏ పండ్లతోనైనా ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. బెర్రీపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. ఇది మంచి రిఫ్రెష్ డ్రింక్ గా పని చేస్తుంది. ఈ బెర్రీ ప్రోటీన్ షేక్ చేయడానికి ఒక కప్పు బెర్రీ పండ్లను తీసుకోవాలి. బ్లెండర్లో ప్రోటీన్ పొడిని, ఒక కప్పు పాలు లేదా పెరుగు వేసి బ్లెండ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది.

ఆపిల్ దాల్చిన చెక్క మిల్క్ షేక్

ప్రతి ఇంట్లో ఆపిల్ పండు ఉండడం సహజం. రోజుకో యాపిల్ తింటే వైద్యులను కలవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ పండులో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే శక్తి దీనికి ఉంది. అలాగే దాల్చిన చెక్క పొడి మంచి రుచిని అందిస్తుంది. డయాబెటిస్ రోగులు దాల్చిన చెక్క పొడిని వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులో ఉంటుంది. బ్లెండర్లో ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ ఓట్స్, ఒక స్పూను వెనిల్లా ప్రోటీన్ పౌడర్, తరిగిన యాపిల్ ముక్కలు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాసులో వేసి తాగేయాలి. చాలా టేస్టీగా ఉండే మిల్క్ షేక్ ఇది.

అవకాడో చాక్లెట్ మిల్క్ షేక్

అవకాడో పండ్లు క్రీమీగా, టేస్టీగా ఉంటాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ. అలాగే చాక్లెట్లో కూడా అదనపు చక్కెర అవసరం లేకుండానే మంచి రుచి ఇచ్చే గుణం ఉంటుంది. బ్లెండర్లో ఒక టేబుల్ స్పూన్ తీయని కోకో పౌడర్, ఒక కప్పు పాలు, ఒక స్కూప్ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్, ఒక స్పూన్ తేనె వేసి చివర్లో అవకాడో ముక్కలను కూడా వేయాలి. బ్లెండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసుకోవాలి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. భోజనం తిన్నంత సంతృప్తిని ఇది ఇస్తుంది.

బొప్పాయి జింజర్ మిల్క్ షేక్

బొప్పాయి ఆరోగ్యకరమైన పండు. ఇందులో వాడే అల్లం కూడా రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి.. బొప్పాయిల్లో అధికంగా ఉంటాయి. దానిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. బ్లెండర్లో ఒక కప్పు బొప్పాయి ముక్కలు, అల్లం తరుగు, ఒక కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బ్లెండ్ చేసుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మిల్క్ షేక్ లో ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

పైనాపిల్ పాలకూర మిల్క్ షేక్

పైనాపిల్, పాలకూర కలిపితే ఎలా ఉంటుందో అనుకుంటారు, కానీ ఈ మిల్క్ షేక్ తాగి చూస్తే రుచి అదిరిపోయేలా ఉంటుంది. పైనాపిల్‌లో విటమిన్ సి, బ్రోమెలైన్ ఉంటాయి. జీర్ణక్రియకు బ్రొమలైన్ ఎంతో ఉపయోగపడే ఎంజైమ్. పాలకూరలో ఇనుము అధికంగా ఉంటుంది. బ్లెండర్లో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, పాలకూర, అరటిపండు, ప్రోటీన్ పౌడర్, కొబ్బరి నీళ్లు వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఒక గ్లాసు నిండా తాగితే ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. ఒకసారి తాగి చూడండి. మీకు పైన చెప్పిన మిల్క్‌షేక్ లన్నీ ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి.

2024-09-04T11:10:30Z dg43tfdfdgfd