NAVAGRAHAS POOJA: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: జాతకాలను విశ్వశించేవారంతా ఎప్పుడో ఒకప్పుడు నవగ్రహారాధన తప్పకుండా చేస్తారు. ఆయా దేవాలయాల సందర్శన, ప్రదక్షిణలు చేస్తే స్నానం చేయాలా కాళ్లు కడుగుకోవాలా అనే విషయాలు రకరకాలుగా చెప్తారు. ముఖ్యంగా నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కోవాలా- వద్దా, కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలనే విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అయితే నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రం లోనూ లేదు. నవగ్రహాల పూజ చేసి అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది చెబుతుంటారు. నవగ్రహాలకు బయట నుంచి తగలకుండా ప్రదక్షణలు చేస్తే ఎటువంటి కాళ్లు కడుగుకోవడం అవసరం లేదు. 

నవ గ్రహ శ్లోకం 

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

Also Read: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

అయితే శనిత్రయోదశి, ఇతర గ్రహబాధలు పోవడానికి రకరకాల పద్ధతులలో పూజలు చేస్తారు. ఆయా సందర్భాలలో సాన్నం చేయాల్సి ఉంటుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలకు పూజలు చేయించుకున్నారో అక్కడున్న పండితులకు తెలుస్తుంది కాబట్టి వారు చెప్పిన నియమాలను పాటించడం మంచిది. శనిత్రయోదశికి తైలాభిషేకం, ఉప్పు, నల్ల నువ్వులు ఇతర పదార్థాలతో తీవ్రమైన శనిదోషాలకు పరిహారం చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటారు. సాధారణంగా స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించే ఆలయాల సందర్శనకు వెళ్తారు. ఇంటి నుంచి గుడి దూరంగా ఉంటే కాళ్లకు దుమ్మూదూళి అంటుకుంటే అప్పుడు గుడికి వెళ్లేముందు కాళ్లు కడుక్కోవాలి. స్వామివారి దర్శనం, పూజ పూర్తైన తర్వాత గుడి నుంచి నేరుగా ఇంటికే వెళ్లాలి. 

Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

మూలవిరాట్ దర్శనం తర్వాతే నవగ్రహ దర్శనం

చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక చేతితో నవగ్రహాలను తాకి ప్రదక్షణ చేస్తుంటారు.పొరపాటున కూడా ఈ విధంగా నవగ్రహాలను తాకి ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి నవగ్రహాల మండపంలోకి వెళ్లేముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి నుంచి కుడివైపుగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి.ఇలా తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత బుధుడి నుంచి రాహు, కేతువులను సందర్శిస్తూ మరో 2 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా నవగ్రహాల చుట్టూ మొత్తం 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే నవగ్రహాల్లో ఉన్న తొమ్మిది గ్రహాల పేర్లు స్మరిస్తూ మండపంలోంచి బయటకు వచ్చేటప్పుడు నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కి నడుస్తూ బయటకు రావాలి. ముందుగా మూలవిరాట్ దర్శనం పూర్తిచేసుకున్న తరువాతనే నవగ్రహాల దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలి.ఇంటికి వెళ్లగానే లోపలికి ప్రవేశించకుండా చాలామంది బయటనే కాళ్లుచేతులు కడుగుతుంటారు. ఇలా కాళ్లు చేతులు కడిగి లోపలికి వెళ్లడం వల్ల మనం చేసిన పూజ వ్యర్థమవుతుంది.కనుక కాళ్లుచేతులు కడుక్కోకుండా ఇంటిలోనికి ప్రవేశించడం వల్ల మనం చేసిన పూజ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.  

2023-06-03T01:20:33Z dg43tfdfdgfd