One Day Lover | శతకోటి దరిద్రాలకు సహస్రకోటి ఉపాయాలు అన్నట్టు, చైనా యువకులు పెండ్లి గోల తప్పించుకోవడానికి సరికొత్త మార్గమొకటి కనిపెట్టారు. అదే వన్‌డే లవర్… అదేనండీ ఒక్కరోజు ప్రేమికురాలు. మనం అద్దెకు కార్లు, టెంట్ సామాన్లు తీసుకున్నట్టే అక్కడివాళ్లు గర్ల్‌ఫ్రెండ్‌ని అద్దెకు తెచ్చుకుంటున్నారట. మొన్నటిదాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా, దాన్ని కట్టడి చేయడానికి గతంలో నానా తిప్పలూ పడ్డ సంగతి తెలిసిందే. కానీ అదే ఇప్పుడు ముప్పుగా పరిణమించింది. గడిచిన 40 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా ఆ దేశంలో జనాభా వృద్ధి పడిపోయింది. దాంతో వృద్ధుల జనాభా పెరిగింది. ఇప్పుడు మళ్లీ తమ దేశానికి నవవారసులు కావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం కొత్త కొత్త పథకాలనూ తీసుకువస్తున్నది.
చైనాకు కొత్తగా ఓ చిక్కు వచ్చి పడింది. పనిభారంతోపాటు కుటుంబ బాధ్యతల్ని మోయలేమని భావిస్తున్న చాలామంది చైనా యువకులు పెండ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. కానీ వివాహం విషయలో తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి అధికం అవుతుండటంతో నయా పంథాకు తెరలేపారు. స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ లేదా వన్‌డే లవర్‌తో పెద్దల్ని మేనేజ్ చేస్తున్నారు. అద్దె లవర్‌ను తెచ్చుకుని ఈమే నా గర్ల్‌ఫ్రెండ్ అని చూపిస్తున్నారట. ఇంతకీ అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ అంటే ఏంటంటే… ఎవరినైనా కలిసేటప్పుడు, ఏ సినిమాకో వెళ్లేటప్పుడు పక్కన లవర్ కావాలనుకుంటే ఆ పూట కొంత చెల్లించి అమ్మాయిని తెచ్చుకోవచ్చన్నమాట. అంటే, ఈ లవర్‌తో కలిసి తిరగొచ్చు, సినిమా చూడొచ్చు, రెస్టారెంట్‌కి వెళ్లొచ్చు, ముద్దు, కౌగిలింతల వరకు కూడా అవకాశం ఉంటుంది. కానీ, శృంగారానికి మాత్రం నో చాన్స్! ఇందుకోసం రోజుకు సుమారు రూ.7000 చెల్లిస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లు, సోషల్ టూర్ల కోసమూ, స్నేహితులు, బంధువులకు పరిచయం చేసేందుకు ఈ అద్దె గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకుంటున్నారట. స్వలింగ సంపర్కులు కూడా ఇతరుల నుంచి వచ్చే విమర్శలకు చెక్ పెట్టేందుకు అద్దె చెల్లించి వీళ్లతో తిరుగుతున్నారు. ఈ ట్రెండ్ ఎంతగా పాకిపోయిందంటే చైనా కొత్త సంవత్సరాది సందర్భంగా ఒక్కరోజులో తాను సుమారు రూ.5 లక్షలు సంపాదించానని ఒక అమ్మాయి మీడియాతో చెప్పింది. అబ్బాయిలకు ఇది సౌకర్యంగా ఉన్నా, అమ్మాయిలను ఇలా ఉపయోగించుకోవడం వాళ్లను అవమానించడమే అని చాలామంది నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. వెర్రి వేయితలలు వేయడం అంటే ఇదేమరి!
2024-07-31T22:53:55Z