పిల్లలే తల్లిదండ్రుల మొదటి బాధ్యత. వారికి రక్షణ కల్పిస్తూనే వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. పిల్లలన్నాక చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. ఆ తప్పులను తల్లిదండ్రులే సరిదిద్దాలి. వారిని క్రమశిక్షణలో ఉంచాలన్న ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. అలాగే వారిని బయటివారి ముందే తిట్టడం, కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారిలో ఎన్నో మార్పులు వస్తాయి. అలా ఇతరుల ముందు తన పిల్లల్ని తిట్టే తల్లిదండ్రులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఇతరుల ముందు పిల్లల్ని కొట్టడం, అరవడం వల్ల వారు భయపడతారని, క్రమశిక్షణలో ఉంటారని భావించే తల్లిదండ్రులు పిల్లల వ్యక్తిత్వాన్నే మార్చేస్తారు. మీరు చేసే అలవాటు క్రమంగా అతని వ్యక్తిత్వంలో పెద్ద మార్పును తీసుకురావడం ప్రారంభిస్తుంది. తల్లిదండ్రులు ఈ రకంగా కఠినమైన ప్రవర్తన వల్ల పిల్లల్లో అబద్ధం చెప్పడం, కోపం, చిరాకు, ధిక్కరించడం, తప్పుడు పనులు చేయడం వంటి లక్షణాలు వస్తాయి. పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం ప్రతి తల్లిదండ్రుల మొదటి బాధ్యత, కానీ ఈ బాధ్యతను నెరవేర్చేటప్పుడు, వారు పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతరుల ముందు పిల్లాడిపై అరవడం వల్ల వారికి ఎన్నో అనర్థాలు కలుగుతాయి.
'ది జర్నల్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్'లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, పిల్లలపై అరవడం అనేది వారిని కొట్టినంత ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఇతరులు ముందు పిల్లలపై అరవడం మాత్రం వారిలో ఒత్తిడి, నిరాశ వంటి లక్షణాలను కలిగిస్తుంది.
పిల్లలపై తరచూ అరవడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు. బాల్యంలో పిల్లలను ఎక్కువగా తిడితే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ పిల్లవాడు తన స్నేహితులతో సరిగా మాట్లాడలేడు.
మనస్తత్వవేత్త బెర్నార్డ్ గోల్డెన్ చెబుతున్న ప్రకారం, తల్లిదండ్రులు పిల్లలపై అరుస్తున్నప్పుడు ఒక వ్యక్తి శరీరంలోని హెచ్చరిక వ్యవస్థ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి వెంటనే పోరాడే లేదా షాకయ్యే స్థితికి వస్తాడు. కార్టిసాల్, ఆడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి మెదడులోని కొన్ని భాగాలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల శరీరంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
పిల్లలు చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. దీని వల్ల వారిపై అరవడం వల్ల అది వారిని త్వరగా బాధపెడుతుంది. అలాంటిది అందరిముందు పిల్లవాడిని తిట్టడం వల్ల అతనికి కోపం తెప్పిస్తుంది. ఆ కోపం వల్ల వారి మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరుల ముందు చులకనగా మాట్లాడడం, తిట్టడం వంటివి చేయకూడదు.
పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు తమ పిల్లలతో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మీరు మీ పిల్లలను ఇతరుల ముందు తిట్టడం, కొట్టడం లేదా అరవడం చేస్తే, వారితో మీరు అనుబంధం ఏర్పరచుకోవడం కష్టంగా మారుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులను సురక్షితంగా భావించరు. అలాంటి పిల్లలు సొంత తల్లిదండ్రులను నమ్మలేరు. దాని వల్ల వారి బంధం బలహీనపడటం మొదలవుతుంది. కాబట్టి ఇతరుల ముందు మీ పిల్లలను అతిగా తిట్టడం, ఇంట్లో వారిపై తరచూ చేయిచేసుకోవడం వంటి పనులు చేయవద్దు.
2024-09-04T02:55:17Z dg43tfdfdgfd