వేసవికాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. స్కూల్ ఉండదు కాబట్టి పిల్లలు ఎక్కువగా బయట తిరగడానికి, ఆడుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల వారు రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎండల వేడి నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో కొన్ని చిట్కాలు మీకోసం. చూసేయండి.
ఎండకాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. పరీక్షలు ముగిసి ఇంట్లో ఉండటం వల్ల బయటకు వెళ్లి ఆడుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు. ఆహారం, నిద్రను కూడా నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ సీజన్‌లో తల్లిదండ్రులు అజాగ్రత్తగా ఉంటే పిల్లలకు డీహైడ్రేషన్ తో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయి. మరి వేసవిలో పిల్లలను ఎలా చూసుకోవాలి? వారికి ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఇక్కడ చూద్దాం.
పిల్లలు సాధారణంగా వేసవిలో ఇంట్లో ఉండటానికి బదులు బయటకు వెళ్లి ఆడుకోవడానికి ఇష్టపడతారు. కానీ పిల్లలను మధ్యాహ్నం సమయంలో ఎప్పుడూ బయటకు పంపొద్దు. ఈ సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం, సాయంత్రం టైంలో ఆడుకోవడానికి అనుమతించాలి.
వేసవిలో పిల్లల చర్మం పొడిబారడం, దురద, వాపు లాంటి అనేక రకాల సమస్యలకు గురవుతుంది. డీహైడ్రేషన్ కూడా వస్తుంది. కడుపు నొప్పి, తలనొప్పి, వికారం, మూత్ర విసర్జనలో సమస్యలు శరీరంలో నీటి కొరతకు సంకేతాలు. కాబట్టి ఈ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ పిల్లలకు 2 లీటర్ల నీరు తాగించండి.
అంతేకాదు ఉదయం ఒక గ్లాసు కొబ్బరి నీరు తప్పకుండా ఇవ్వండి. ఇందులో ఉండే పొటాషియం ఎండవేడి నుంచి పిల్లలను రక్షించడంలో సహాయపడుతుంది. మట్టి కుండలోని నీరు, సబ్జా నీరు పిల్లలకు చాలా మంచివి. పుచ్చకాయ, దోసకాయ, ద్రాక్ష లాంటి పండ్లను ఇవ్వొచ్చు. వాటితో జ్యూస్ చేసి కూడా ఇవ్వండి.
ఒక కప్పు మజ్జిగలో ఒక స్పూన్ జీలకర్ర పొడి, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలకు ఇస్తే డీహైడ్రేషన్ ఉండదు. జీర్ణక్రియ కూడా త్వరగా జరుగుతుంది. మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12 ఉండటం వల్ల వికారం, తలనొప్పి లాంటి సమస్యలు తొలగిపోతాయి.
సాధారణంగా వేసవిలో వండిన ఆహారం త్వరగా పాడైపోతుంది. దీని కారణంగా చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టి తింటారు. కానీ ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని పిల్లలకు ఎప్పుడూ ఇవ్వకూడదు. దానివల్ల పిల్లలకు వాంతులు, మైకం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి. పిల్లలకు కూల్ వాటర్ కూడా ఇవ్వకపోవడమే మంచిది.
వేసవిలో పిల్లలకు మసాలా, కారం, స్వీట్లు వంటి ఆహారాలు ఇవ్వడం మానుకోండి. ఇవి శరీర వేడిని పెంచుతాయి. పిజ్జా బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్ అస్సలు ఇవ్వొద్దు. ఇవి దాహాన్ని పెంచుతాయి.
వేసవిలో వేడిగా ఉన్నప్పుడు పిల్లలకు కాటన్ దుస్తులు వేయడం మంచిది. ఇవి ఇతర దుస్తుల కంటే ఎక్కువగా చెమటను పీల్చుకుంటాయి. పిల్లలకు లేత రంగు దుస్తులు మాత్రమే వేయండి.
వేసవిలో పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునేలా చూసుకోండి. కూలింగ్ గ్లాసెస్ సూర్య కిరణాలు పిల్లల కళ్ళపై పడకుండా కాపాడుతాయి. టోపీ ధరించడం మంచిది. తలకు ఎండ తగిలితే తలనొప్పి, మైకం ఇతర సమస్యలు రావచ్చు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చల్లటి నీటితో ముఖం కడగాలి.
2025-03-12T10:15:14Z