POLYTHENE | పాలిథీన్‌ ఓ పెనుభూతం… అప్రమత్తంగా లేకుంటే భవిష్యత్తు అంధకారమే

Polythene | రామాయంపేట, మార్చి 12 : పాలిథీన్‌ బ్యాగులు ఓ పెనుభూతం లాంటివి.. ఇది ప్రజల్ని ప్రజల జీవితాలను దహించివేస్తుంది. ప్రళయం కన్నా పెద్ద ప్రమాదమే. దీని వల్ల పర్యావరణానికెంతో హాని కల్గిస్తుంది. మురికి కాల్వలు పాలిథీన్‌ కవర్లతో నిండిపోతూ నిలువున ముంచెస్తున్నాయి. ఈ మురికినీరు చెరువుల్లో చేరడంతో ఆ నీటిని తాగిన పశువులు మృత్యు బారిన పడడమే గాకుండా మనుషులు సైతం అనారోగ్యాల బారిన పడ్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కాగితాలు మట్టిలో కలిసిపోయినా ప్లాస్టిక్‌ కవర్లు మాత్రం దశాబ్దాలైన మట్టిలో కృషించిపోవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసిన ప్లాస్టిక్‌ కవర్ల భూతమే కనిపిస్తుంది. గతంలో సుప్రీం కోర్టు సైతం పాలిథిన్‌ కవర్లను నిషేధించాలంటు తీర్పునిచ్చింది. అయినా మార్కెట్‌లో మాత్రం పరిశ్రమలు తమ ఇష్టానుసారంగా నాణ్యత లేకుండా కవర్లను తయారు చేస్తుండటం, వాటిని వ్యాపారస్తులు వాడటం మామూలై పోయింది. పడేసిన పాలిథిన్‌ కవర్‌లు వ్యర్థాలతో కలిగే నష్టాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ కేంద్రం జివోను విడుదల చేసినా దానిని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కి కనీసం పట్టించుకున్న దాఖలాలు ఎక్క‌డ‌ కూడా లేవు. ప్రస్తుత పరిస్థితులలో కొన్ని స్వచ్చంధ సంస్థలు ప్లాస్టిక్‌ వాడవద్దంటూ పలుమార్లు విద్యార్థులతో ప్రచారాలు, ర్యాలీలు నిర్వహించినా ఫలితం లేకుండాపోతుంది. దీనిపై ఉద్యమాలు చేపట్టిన అటు ప్రజలుకాని, ఇటు వ్యాపారస్తులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు.

మార్కెట్‌లో ఇటీవల నాణ్యతలేని కవర్లను విచ్చలవిడిగా వ్యాపారస్తులు వినియోగిస్తున్నారు. ఈ కవర్ల వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడటమే కాకుండా పర్యావణం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఈ అత్యంత హానీకరమైన పాలిథిన్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అదికారులను నియమించి కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే అమాయక ప్రజలు క్యాన్సర్‌, టీబి తదితర వ్యాధుల బారిన పడి విలువైన ప్రాణాలను పాల్‌థిన్‌ దహించివేస్తుంది. ఈ ప్లాస్టిక్‌ భూతం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాలలోని వీటి వినియోగం రోజురోజుకు ఎక్కువగా ఉంది. అందుకోసం అధికారులు కూడా ప్లాస్టిక్‌ వస్తువులను అమ్మవద్దంటూ కరపత్రాలను కూడా విడుదల చేసారు. వీటిపై సమగ్ర చట్టాన్ని తెచ్చి ప్రభుత్వాలే నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా మున్సిపల్‌ ప్రాంతాలలో ప్రతిరోజు ప్లాస్టిక్‌పై వ్యాపార లావాదేవీలు జరిపే షాప్‌లలోకి వెళ్లి మున్సిపల్‌ సిబ్బంది జరిమానాలు, నోటీసులను కూడా అందజేస్తున్నారు.

వ్యాపారులకు నోటీసులిచ్చాం : రామాయంపేట మున్సిపల్ కమిషనర్‌ దేవేందర్‌

పాల్‌థిన్‌ కవర్లు వాడవద్దంటు పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలకు నోటీసులివ్వడం జరిగింది. అయినా కొంత మంది మాత్రం నోటీసులను పెడచెవిన పెడ్తున్నారు. ప్లాస్టిక్‌ను వాడరాదంటు ప్రధాన కేంద్రాల్లో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసాం. ఇదివరకులా కాకుండా ఇప్పుడు ప్ర‌తి ఇల్లు, షాపులు తిరిగి నోటీసులిచ్చి వ్యాపారులకు చెప్పడం జరిగింది. అయినా వాడకాన్ని ఎవ్వరు కూడా ఆపడం లేదు. ఇకముందు కూడా వ్యాపారులకు నోటీసులిచ్చి మళ్లీ వారితో సంతకాలు తీసుకుంటాం. అయినా అలాగే విక్రయిస్తే ఎంతటివారికైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామ‌ని దేవేంద‌ర్ హెచ్చ‌రించారు.

2025-03-12T11:59:47Z