Raw Coconut | దైవానికి నైవేద్యంగా సమర్పించేందుకు హిందువులు తరచూ కొబ్బరికాయలను వాడుతుంటారు. అయితే కొందరు టెంకాయలను తెచ్చి అందులో ఉన్న కొబ్బరిని బయటకు తీసి దాంతో వంటలు కూడా చేస్తుంటారు. కొబ్బరికాయల్లోని కొబ్బరితో అనేక కూరలు కూడా తయారు చేయవచ్చు. కొబ్బరి పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది అన్నం లేదా దోశ, ఇడ్లీ వంటి వాటిల్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా పచ్చి కొబ్బరిని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి కొబ్బరిలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిని ఉదయం తింటే అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
పచ్చి కొబ్బరిలో మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ (ఎంసీటీ) ఉంటాయి. ఇవి రోజంతటికీ కావల్సిన శక్తిని మనకు అందిస్తాయి. పచ్చి కొబ్బరిని తింటే లభించే ఎంసీటీలు మన మెదడును కూడా ఉత్తేజంగా మారుస్తాయి. దీంతో ఆందోళన, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. ఏ విషయంపై అయినా సులభంగా ధ్యాస పెట్టగలుగుతారు. బద్దకం పోతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శక్తి స్థాయిలు ఏమాత్రం తగ్గవు. ఎంత పనిచేసినా అలసిపోకుండా ఉంటారు. పచ్చి కొబ్బరిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. దీంతో నిర్ణయాలు తీసుకునే ఆలోచనా శక్తి కూడా లభిస్తుంది.
పచ్చి కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల పచ్చి కొబ్బరిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వంతా మంచులా కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఈ కొబ్బరిని తినడం వల్ల మనకు లారిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ కొబ్బరిలో ఉండే పాలిఫినాల్స్ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి.
పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మానికి కావల్సిన తేమ లభిస్తుంది. దీంతో చర్మం సహజసిద్ధంగా మృదువుగా మారుతుంది. పొడిబారిన చర్మానికి రక్షణ లభిస్తుంది. అలాగే ఈ కొబ్బరిలో ఉండే ఐరన్ శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా మారుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా ఉంటుంది. పచ్చి కొబ్బరిని తాజాగా ఉన్నది తీసుకోవాలి. దాన్ని 1 లేదా 2 చిన్న ముక్కలు తీసుకుని అవసరం అనుకుంటే కాస్త బెల్లంతోపాటు కలిపి తినాలి. రోజుకు 2 సార్లు కూడా దీన్ని తినవచ్చు. లేదా మీరు రోజూ తినే ఆహారాలపై పచ్చి కొబ్బరి తురుము చల్లి కూడా తినవచ్చు. ఇలా పచ్చి కొబ్బరిని తింటుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
2025-03-12T12:14:50Z