SUN FLOWER | పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

Sun flower | తోగుట‌, మార్చి 12 : సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 7280 పొందాలన్నారు. రైతుల సంక్షేమానికి సొసైటీ అనేక రకాలుగా కృషి చేస్తుందన్నారు. కొనుగోళ్ల‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రైతులందరూ ధాన్యాన్ని కల్లాల వద్దనే ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చి, అధికారులకు సహకరించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తిన పరిష్కరించడానికి తనవంతుగా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ప్రైవేటు వ్యాపారులను నమ్మి రైతులు ఎవరు మోసపోవద్దన్నారు. తొగుట మండలంతో పాటు మిరుదొడ్డి, అక్బర్పేట్ భూంపల్లి, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల నుండి రైతులు ధాన్యాన్ని తీసుకురావడం జరుగుతుందన్నారు. మంగళవారం రోజున ఒక లారీ ధాన్యాన్ని విక్రయించి మిల్లుకు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి, సీఈఓ గంగారెడ్డి, రైతులు బాలేష్ తదితరులు పాల్గొన్నారు.

2025-03-12T12:14:49Z