Supersolid Light | న్యూఢిల్లీ : ద్రవ పదార్థం (లిక్విడ్) ఘన పదార్థం (సాలిడ్)గా మారడాన్నే ఘనీభవన ప్రక్రియ అంటారని మనందరికీ తెలుసు. కానీ, నమ్మశక్యంకాని రీతిలో ఇటలీ శాస్త్రవేత్తల బృందం ఏకంగా కాంతినే ఘనీభవింపజేయగలిగింది. నానో టెక్నాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన ఈ బృందం తొలిసారి కాంతిని ‘సూపర్‌సాలిడ్’లా ప్రవర్తించేలా చేయగలిగింది. తద్వారా ఇప్పటివరకు మనకు తెలిసిన సైన్సును మార్చేసింది. ఈ నూతన ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ‘ఏ సూపర్‌సాలిడ్ మేడ్ యూజింగ్ ఫోటాన్స్’ పేరిట ఈ నెల 5న ‘నేచర్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. ఏదైనా ద్రవం ఉష్ణోగ్రతను దాని ఘనీభవన స్థానానికి తగ్గించినప్పుడు సాధారణ ఘనీభవనం జరుగుతుంది. ఆ ప్రక్రియలో ఆ ద్రవం అణువులు నెమ్మదించి స్పటికాకార నిర్మాణంగా కలిసిపోతాయి. ఇదే మనకు తెలిసిన భౌతికశాస్త్ర సూత్రం.
కానీ, పదార్థంలోని అణువుల ఉష్ణోగ్రతలు పూర్తిగా ‘సున్నా’ స్థాయికి (మైనస్ 273.15 సెంటీగ్రేడ్) తగ్గినప్పుడు వాటి క్వాంటమ్ యాంత్రిక స్వభావం బయటపడుతుందని, పదార్థపు అసాధారణ దశలు కనిపిస్తాయని వారు వివరించారు. గతంలో అతిశీతల అణువులను ఘనీభవింపజేయడం ద్వారా మాత్రమే సూపర్‌సాలిడ్స్‌ను సృష్టించగలిగారు. కాంతి కిరణాల్లో (ఫోటాన్స్‌లో) సూపర్‌సాలిడ్ స్థితిని గుర్తించడం ద్వారా దాని రహస్యాలను ఛేదించేందుకు కొత్త ద్వారాన్ని తెరిచారు. సూపర్‌సాలిడిటీ గురించి తెలుసుకునే దిశగా ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని ఇటలీలోని సీఎన్‌ఆర్ నానోటెక్, పావియా యూనివర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఆంటోనియో జియాన్‌ఫేట్, డేవిడ్ నీగ్రో తెలిపినట్టు ‘న్యూస్‌వీక్’ పత్రిక పేర్కొంది.
2025-03-12T20:59:50Z