UNHYGIENIC HABITS: మీరూ, పిల్లలు తరచూ జబ్బు పడుతున్నారా? ఈ అలవాట్లకు దూరంగా ఉంటే చాలంటున్నారు నిపుణులు!

తరచూ జబ్బు పడటానికి కారణం కేవలం బయటి వాతావరణమో లేక ఆహారమో మాత్రమే కాదు. మీకున్న కొన్ని చిన్న చిన్న చెడు అలవాట్లు కూడా అయి ఉండచ్చంటున్నారు నిపుణులు. ఇవి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఆఫీసుకో లేక పనిమీద బయటికో వెళ్లి రాగానే మీరు నిర్లక్ష్యంగా చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ కుటుంబసభ్యులు పిల్లల పట్ల హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా మీ తప్పుల కారణంగా ఇంట్లోకి చేరిన చెడు బ్యాక్టీరియా వ్యాధులు తలపెట్టక ఉండదు. కనుక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. వదలవు. మీ ఇంట్లోవారో లేదా మీరో ఈ తప్పులు చేస్తున్నారో లేదో చూడండి? వాటిని మార్చుకుని మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

అనారోగ్యానికి కారణమయ్యే రోజూవారి అలవాట్లు:

1) బయట చెప్పులు ఇంట్లో ధరించడం

నేటి తరం చేస్తున్న చాలా పెద్ద పొరపాటు ఏంటంటే.. స్థలం లేకనో లేక పోతాయనే భయంతోనో బయట వేసుకుని తిరిగిన చెప్పులను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. ఇది ఎంత హానికరమో తెలిస్తే ఈ పొరపాటు చేయనే చేయరు. బయట రోడ్ల మీద మురికి, బ్యాక్టీరియా వంటివి పుష్కలంగా ఉంటాయి. మీరు ఎంత శుభ్రంగా కడిగినా కూడా వాటికి సంబంధించిన వ్యాధి కారకాలు పూర్తిగా తొలగిపోవు. ఇలా చెప్పులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల గాలి ద్వారా అవన్నీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి.

ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చెప్పుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు తరచూ నేలను తాకుతుంటారు, చెప్పులను తాకి ఆడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే చెప్పులను ఎప్పుడూ ఇంట్లోకి తీసుకురాకండి.

2) బయట నుండి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లు కడుక్కోకపోవడం:

మీరు బయట ఉన్నప్పుడు, చాలా రకాల వస్తువులను చేతులతో తాకుతారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించినా లేదా మీ స్వంత వాహనంలో ప్రయాణించినా, మీ చేతులు, కాళ్ల మీద అనేక రకాల బ్యాక్టీరియా చేరుకుంటుంది. అటువంటి సమయంలో ఇంటికి రాగానే చెప్పులను బయటే విడవాలి. ఇంటికి వచ్చిన తర్వాత బయట చెప్పులు విప్పిన తర్వాత ముందుగా చేతులు కడుక్కోండి. ఆ తర్వాత కాళ్లను శుభ్రం చేసుకోండి.

3) బయట సూట్‌కేస్‌ను పడక మీదకు తీసుకురావడం

చాలా మంది జర్నీ కోసం వినియోగించే సూట్‌కేస్‌ను బెడ్ రూంలోకి తెచ్చేస్తుంటారు. ఈ సూట్‌కేస్‌తో పాటే వ్యాధులను వ్యాప్తి చేసే పలు క్రిములు ఉంటాయి. బెడ్ మీదకు చేరిన ఆ క్రిములు క్రమంగా బెడ్ మీద నుంచి మీ శరీరంలోకి చేరుకుంటాయి.

4) బయట దుస్తులు బెడ్ మీదకు తేవడం

ఉదయం మీరు ఇంటి నుండి శుభ్రమైన దుస్తులు ధరించి బయటకు వెళ్తుంటారు. రోజువారీ పనుల నిమిత్తం పలు ప్రదేశాల్లో తిరుగుతుంటారు. అక్కడి వాతావరణంలో ఉండే క్రిములు, సూక్ష్మ జీవులు దుస్తులపై చేరుకుంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వాటిని విడిచి పక్కకుపెట్టేయాలి. అలా చేయని పక్షంలో పడక మీదకు చేరుకున్న ఆ బ్యాక్టీరియా దుప్పట్లతో పాటు ఇంటి పరిసరాల్లో ఉండిపోతుంది.

5) టాయిలెట్ నుండి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడగకపోవడం

చాలా మంది నిర్లక్ష్యపెట్టే అంశం ఇది. సాధారణంగా నీటితో కడుక్కొని శుభ్రం చేసుకున్నామని ఫీలవుతుంటారు. ముమ్మాటికీ ఇది తప్పు విషయం. టాయిలెట్ లేదా వాష్‌రూమ్‌కు వెళ్ళిన తర్వాత లేదా అక్కడి తలుపు తాకిన తర్వాత కచ్చితంగా చేతులను సబ్బుతో కడుగుకోవాలి. బాత్రూం డోర్, బాత్రూంలో ఉండే ట్యాప్, వాష్‌రూమ్ కమోడ్ వీటిల్లో వేటిని ముట్టుకున్నా మరోసారి చేతులు కడుగుకోవాలనే విషయాన్ని మర్చిపోకండి.

2025-02-04T11:46:18Z