Variety Food | చెప్పులు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, గొడుగులు… యాక్సెసరీలుగా ఇవన్నీ మనం వాడేవే. కానీ ఇప్పుడు ఆహార పదార్థాల జాబితాలోనూ చేరిపోయాయి. రంగురంగుల్లో రకరకాల రుచుల్లో తయారవుతున్నాయి. ఫ్యాషన్, ఫుడ్ ట్రెండ్ కలయికగా ఆహార పదార్థాలకు కొత్త గ్లామర్‌ను తీసుకొస్తున్నాయి. ఇవేకాదు రంగురంగుల డ్రెస్సులూ తియ్యగా నోట్లో కరిగిపోతున్నాయి.
కడుపు నింపుకోడానికే తినడం నుంచి కళ్లు మెచ్చినవీ లాగించే కాలానికి వచ్చేశాం. అందుకే ఆహారాన్ని కూడా అత్యంత ఆకర్షణీయంగా, సరికొత్తగా తీర్చిదిద్దేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు క్రియేటివ్ బేకర్లు. అలా అని రుచిలో రాజీ పడతారా అంటే.. తగ్గేదేలే అంటారు. ఇప్పుడు అదే కోవలో తయారవుతున్నాయి ఎడిబుల్ యాక్సెసరీస్. తియ్యటి హ్యాండ్‌బ్యాగులు, నోరూరించే చెప్పులు, కమ్మటి టోపీలు… ఇలా బోలెడు రకాలు ఉన్నాయి ఇందులో. నిజానికి యాక్సెసరీలను ఫ్యాషన్‌కు గుర్తుగా భావిస్తాం.
Variety Food3
ఇక, దుస్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. అందుకే మనం ఇష్టంగా తినే ఆహారంలోనూ ముఖ్యంగా యువత ఇష్టపడే కేకుల్లాంటి వాటి తయారీలో ఫ్యాషన్‌కు పెద్దపీట వేస్తున్నారు నవతరం వంటగాళ్లు. తద్వారా ఇటు ఫుడ్, అటు ఫ్యాషన్‌ల ఫ్యూజన్‌ను సృష్టిస్తున్నారు. ఇందులో షుగర్ వేఫర్లతో తయారయ్యే రంగురంగుల డ్రెస్సులూ, బిస్కెట్లతో హ్యాండ్‌బ్యాగులు, ఫాండెంట్‌తో టోపీలు, చెప్పులు.. ఇలా ఎన్నో రకాలు చూడగానే నోరూరిస్తున్నాయి. అంతేకాదు కప్‌కేకులు, కోన్‌లలాంటి వాటితో ఫ్యాషనబుల్ చెప్పుల్ని కూడా తయారు చేస్తున్నారు. వీటిలో కొన్నింటిని డెజర్ట్స్‌లాగా నేరుగా తింటే, కొన్నింటిని కేకుల మీద అలంకరణకు వాడుతున్నారు.
చిన్న సైజులో రకరకాల రంగుల్లో చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. యూట్యూబ్‌తోపాటు రకరకాల ఫుడ్ బ్లాగుల్లో వీటి తయారీకి సంబంధించిన పాఠాలున్నాయి. కాబట్టి, అందుబాటులో ఉన్న పదార్థాలతో మనమూ సొంతంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలతోపాటు, ఇంటికొచ్చిన పెద్దల్నీ మన టాలెంట్‌తో ఆశ్చర్యపరచొచ్చు! మీరూ ప్రయత్నించండి మరి!
“Kasi | కాశీలో ఇన్ని వెరైటీల ఫుడ్స్ దొరుకుతాయన్న సంగతి తెలుసా”
2023-03-26T04:24:42Z dg43tfdfdgfd