Wednesday Motivation: చాలామందికి కాస్త ఇగో ఉంటుంది. తప్పు తమదైనా కూడా తలొంచేందుకు ఇష్టపడరు. పైగా దాన్ని ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం అని చెప్పుకుంటారు. ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం అంటే తప్పు చేశాక కూడా తప్పు నాది కాదు అని వాదించడం కాదు, తప్పుని ఒప్పుకొని సంబంధాలు తెగిపోకుండా కాపాడుకోవడం. ఏదైనా అనుబంధంలో తగాదాలు సహజం. భార్యాభర్తల నుంచి తండ్రీ కొడుకుల వరకు ప్రతి ఒక్కరికీ మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. వాదనలు జరుగుతూనే ఉంటాయి. ఆగ్రహంలో నోటికి వచ్చిన మాటలను అంటూనే ఉంటారు. ఒక వాదన జరిగాక లేదా ఒక గొడవ జరిగాక తప్పు ఎవరిదో అర్థం చేసుకొని హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తే ఆ బంధం నిలుస్తుంది. లేకపోతే చిన్న చిన్న వాదనాలకే అనుబంధాలు తెగిపోతాయి.
కొంతమంది తమది తప్పు అని తెలిసినా కూడా తలొగ్గడానికి ఇష్టపడరు. ఎదుటివారికి సారీ చెప్పరు. అనుబంధాలనైనా వదులుకుని ఆత్మగౌరవం పేరుతో ఒంటరిగా మిగిలిపోతారు. ఈ పద్ధతి మీ బంధాలకే కాదు, మీ జీవితానికే హానికరం. ‘ఇలా చేసినందుకు క్షమించండి’ అన్న ఒక్క మాట ఎన్నో స్నేహాలను, బంధాలను కలుపుతుంది. నిజమైన క్షమాపణ ఏ హృదయాన్నైనా కరిగిస్తుంది. క్షమాపణ చెప్పడానికి ఒకటే మార్గం కాదు, ఇతర సులువైన మార్గాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చింది ఎంపిక చేసుకొని మీ తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకోండి.
ఫోనులో మెసేజులు పెట్టడం ద్వారా క్షమించమని అడిగే కన్నా వ్యక్తిగతంగా వారితో మాట్లాడి సారీ చెప్పండి. ఇది వారి మనసును త్వరగా కరిగిస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేమ పూర్వకంగా ఉండేలా చూసుకోండి. దేనికైనా కమ్యూనికేషన్ చాలా అవసరం. ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో.. అది అంతరాన్ని మరింత సృష్టిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా మీరు క్షమాపణ చెప్పదలుచుకుంటే వారి ఎదురుగా నిలుచుని వారి కళ్ళల్లోకి చూస్తూ క్షమాపణ చెప్పండి. తప్పు మీదే అయితే మాత్రమే ఇలా చేయండి, తప్పు ఎదుటివారిదే అయితే అది పరిష్కరించుకునేందుకు చర్చించండి. నాకెందుకులే అని వదిలేస్తే ఆ సమస్య పెద్దదిగా మారిపోతుంది.
ఒకప్పుడు ఉత్తరాలు మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే ఫోన్లు వచ్చాయో లేఖల కాలం గడిచిపోయింది. కానీ లేఖ రాయడం అనేది ఒక అందమైన అనుభూతి. క్షమాపణ చెప్పడానికి ఓ కాగితంపై మీ మనసులోని మాటను రాయండి. మీరు చేసిన తప్పుకు మీరే బాధ్యత వహిస్తున్నట్టు చెప్పండి. మరొకసారి అలాంటి పనులు జరగవని రాసి లేఖను పంపించండి. ఇది వారి మనసును కదిలించే అవకాశం ఉంది.
ఎవరితో అయితే మీరు మనస్పర్ధలు వచ్చేలా ప్రవర్తించారో వారితో ప్రత్యేకంగా ఏదైనా టూర్ ప్లాన్ చేయండి. టూర్ అనగానే బయట నగరాలు, బయట ప్రదేశాలు అనుకోకండి. మీకు అందుబాటులో ఉన్న ఏ ప్రదేశానికైనా వెళ్లి వారితో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. వారి బాధను ముందుగా వినండి. మీరు ఎంత మంచి శ్రోతగా ఉంటే మీ జీవితం అంత బాగుంటుంది. వారితో వాదనకు దిగకండి. వారి మనసులోని బాధను పూర్తిగా చెప్పనీయండి. ఆ తర్వాత వారితో వాదన పెట్టుకోకుండా మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పండి.
మీ జీవితంలో ఎదుటివారు ఎంత ప్రత్యేకమైనవారో వారికి వివరించండి. మనస్పర్ధలుతో విడిపోయిన వ్యక్తులు మీ స్నేహితులో, బంధువులో, జీవిత భాగస్వామి లేదా తల్లీ తండ్రీ ఎవరైనా కావచ్చు. కాబట్టి వారితో నేరుగా మాట్లాడి మీ జీవితంలో వారి పాత్రను ఒకసారి గుర్తు చేయండి. ఇది కూడా క్షమాపణలో భాగమే. ఎప్పుడైతే మీ ఇద్దరి అనుబంధం ఒక్కసారి స్మరణకు వస్తుందో ఎదుటివారు వెంటనే చల్లబడిపోతారు.
ఏ విషయంపై మీ స్నేహితులు లేదా బంధువులతో సమస్య వచ్చిందో.. అదే విషయం గురించి పదేపదే మాట్లాడకండి. దాన్ని సద్దుమణిగేలా చేయండి. ఇద్దరూ కలిసిమెలిసి తిరిగే అవకాశాన్ని కల్పించండి. మీకు ఎదుటివారిపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉందని వారికి చెప్పండి. ఇలాంటి గొడవలకు మరోసారి తావివ్వకుండా జాగ్రత్త పడదామని వివరించండి. ఇది కూడా క్షమాపణ చెప్పకుండానే చెప్పినట్టే లెక్క.
2024-09-03T23:55:13Z dg43tfdfdgfd