ఆత్మవిశ్వాసం నింపండి!

రాకెట్‌ను ఆకాశంలో పంపడం కంటే.. పిల్లల్ని పెంచి పెద్దచేసి వృద్ధిలోకి తీసుకురావడమే కష్టమైన పని. అందులోనూ ప్రతి బిడ్డా ప్రత్యేకమే. పిల్లల స్వభావాన్ని బట్టి పెంచే పద్ధతులను ఎంచుకోవాలి. కాకపోతే, కొన్ని ప్రాథమిక సూత్రాలు తప్పనిసరి.

పిల్లల్లో అర్థంలేని భయాలు నూరిపోయకండి. ఏ విషయాన్ని అయినా శాస్త్రీయంగా ఆలోచించడం నేర్పండి.

చేయాల్సిన పనులు, చేయకూడని పనులు.. తరహాలో ఓ పెద్ద చిట్టా వాళ్ల బుర్రలో తోసేయకండి. తప్పులు చేయనివ్వండి. పొరపాట్లు జరగనివ్వండి. ఓపిగ్గా వాటిని సరిదిద్దండి.

బాధ, దుఃఖం, కోపం.. ఇలాంటి ఉద్వేగాలను సున్నితంగా వ్యక్తం చేయడం అలవాటు చేయాలి. ఆ సాధన చిన్నచిన్న విషయాల నుంచే మొదలు కావాలి.

మనిషిలో సెన్సాఫ్‌ హ్యూమర్‌ చాలా అవసరం. ప్రతి బిడ్డలో హాస్యస్పృహ ఉంటుంది. దండనలతో దాన్ని దూరం చేయకండి.

నచ్చిన పుస్తకాలు, ఇష్టమైన డ్రెస్‌లు, చూడాల్సిన సినిమాలు.. ఇలా వాళ్లకు ఎంచుకునే అవకాశం ఇవ్వండి. దీనివల్ల మంచిచెడులు, లాభనష్టాలు బేరీజు వేసుకునే శక్తి వస్తుంది.

మీరు కోరుకున్నట్టు మీ పిల్లలు ఉండరు. మీరు ఉన్నట్టే ఉంటారు. పిల్లల మీద పెద్దల ప్రభావం చాలా ఉంటుంది. మిమ్మల్నేరోల్‌ మాడల్‌గా తీసుకుంటారు. కాబట్టి, బాధ్యత కలిగిన పిల్లల్ని తయారు చేయాలంటే, ముందుగా మీరు బాధ్యత కలిగిన తల్లిదండ్రులు కావాలి.

2023-06-07T22:25:30Z dg43tfdfdgfd