ఒత్తిడితో యువత డ్రగ్స్​కు అలవాటు పడుతున్నరు

ఒత్తిడితో యువత డ్రగ్స్​కు అలవాటు పడుతున్నరు

కూకట్ పల్లి, వెలుగు : యువత భవిష్యత్​ను అంధకారంలోకి నెడుతున్న డ్రగ్స్​ వాడకాన్ని నివారించి సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని  రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్​ బి.విజయ్ సేన్ రెడ్డి అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న డ్రగ్స్​ వాడకం సామాజిక రుగ్మతగా మారి ఆందోళన కలిగిస్తున్నదన్నారు. జేఎన్టీయూ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ధర్మసేన చారిటబుల్​ సంస్థ ఆధ్వర్యంలో శనివారం కూకట్ పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో ‘నార్కొటిక్ డ్రగ్స్ నివారణ’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.  హైకోర్టు జడ్జి విజయ్​సేన్ రెడ్డి చీఫ్​గెస్టుగా హాజరై మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఒత్తిడిని జయించలేక తప్పుడు బాట పడుతూ, పరిస్థితుల ప్రభావానికి లొంగి డ్రగ్స్​కి బానిసలుగా మారుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి డ్రగ్స్​కి అలవాటు పడిన వారు బయటపడటం చాలా కష్టమని, అసలు అలాంటి అవకాశాన్నే ఇవ్వకుండా డ్రగ్స్​ నివారణకు అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఏటా డ్రగ్స్​ కేసుల్లో శిక్షలు పడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నదని వెల్లడించారు.

హైదరాబాద్ సిటీలో విచ్చలవిడిగా పెరుగుతున్న పబ్స్, బార్లు కూడా యువతను డ్రగ్స్​ వైపు ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. జేఎన్టీయూ వైస్​ చాన్సలర్​ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్​ నివారణకు వర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్​ నివారణకు అందరం కట్టుబడి ఉంటామని కార్యక్రమానికి హాజరైన వారితో ఆయన  ప్రతిజ్ఞ చేయించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.లింబాద్రి, ధర్మసేన సంస్థ ప్రతినిధి నిశాంత్​, వర్సిటీ రెక్టార్​ ప్రొఫెసర్​ ఎ.గోవర్ధన్​ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-06-04T04:17:27Z dg43tfdfdgfd