చెరువెల్ల చేపలే..!

  • వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను విడుదల చేస్తున్న ప్రభుత్వం
  • జిల్లా వ్యాప్తంగా 25 వేల మంది మత్స్యకారులకు లబ్ధి
  • ఏండేండ్లలో రూ.29.27 కోట్లతో చేప పిల్లలు పోసిన సర్కార్‌
  • జిల్లాలో ఏటా పెరుగుతున్న మత్స్య సంపద

నల్లగొండ, జూన్‌ 7 ; గతంలో మండలానికి ఒకటో రెండో పెద్ద చెరువులు..వర్షానికి అవి నిండితే దానికో కాంట్రాక్టర్‌..ఆ కాంట్రాక్టర్‌ చేపలు పడితే ఆ మండలంలోని మాంస ప్రియులంతా క్యూ కట్టినా ఒక్క చేప దొరకనిది అప్పటి పరిస్థితి. నేడు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు పోయడంతో ప్రతి గ్రామంలో ఉన్న చెరువులో పుష్కలంగా చేపలు లభ్యమవుతున్నాయి.

ఏటా 4 నుంచి 5 కోట్ల చేపలు వదిలివేత

ఆది నుంచి గత పాలకులు పట్టించుకోకపోవడంతో చేపలు కరువే అని చెప్పవచ్చు. దీనికి తోడు చెరువుల్లో నీరు లేకపోవడమే కారణం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువులు మత్తడి దుంకడంతో ప్రభుత్వం చేపలు పెంచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని 2016-17 నుంచి ఇప్పటి వరకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నది. ఈ ఏడేండ్ల కాలంలో జిల్లాలో ఉన్న 1,399 చెరువుల్లో ఏటా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు చేప పిల్లలు వదులుతున్నారు. ఇప్పటి వరకు రూ.29.27 కోట్లను వెచ్చించి 29.91కోట్ల చేప పిల్లలను విడుదల చేసింది. ఇక జిల్లాలో ఉన్న తొమ్మిది పెద్ద జలాశయాల్లో ఇప్పటి వరకు 1.50 కోట్ల రొయ్యలు పోయడానికి రూ.3.47 కోట్లు వెచ్చించింది సర్కార్‌. జిల్లా వ్యాప్తంగా 227 మత్స్య సహకార సొసైటీలు ఉండగా ఆయా సొసైటీల్లో 25, 254 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 24 మహిళా సొసైటీలు కూడా ఉన్నాయి. ఈ సభ్యులు ఆయా చెరువుల్లో ఉన్న చేపలు పట్టి మెరుగైన జీవనం సాగిస్తున్నారు.

నీలి విప్లవం కింద పలు చెరువుల నిర్మాణం..

నీలి విప్లవంలో భాగంగా కృత్రిమ చెరువుల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. 2017-18 నుంచి 2020-21 వరకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో మహిళా మత్స్య కారులతో పాటు ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు ఈ చెరువుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. జిల్లాలో కొత్తగా చేపల చెరువులు నిర్మించుకున్న 55 మంది మత్స్యకారులకు 3.32 కోట్ల సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం చేప విత్తన చెరువుల నిర్మాణాల కింద 37 మందికి 1.84 కోట్ల సబ్సిడీ అందజేసింది. ఇక చేప విత్తనాల హాచరీస్‌ల నిర్మాణాలకు ముగ్గురికి రూ.40 లక్షల సబ్సిడీ ఇవ్వగా రీ సర్కిలేటెడ్‌ ఆక్వా కల్చర్‌ పద్ధ్దతి ద్వారా నలుగురికి రూ.1.20 కోట్ల సబ్సిడీ అందజేసింది. ఇదే పథకం కింద 60శాతం సబ్సిడీతో పంజరంలలో చేపలు పెంచడానికి 12 మంది మత్స్యకారులకు రూ.2.40 కోట్ల సబ్సిడీ ఇవ్వగా సంచార చేపల అమ్మక వాహనాలు ముగ్గురికి ఇచ్చి రూ.18 లక్షల సబ్సిడీ ప్రభుత్వం అందజేసింది.

సబ్సిడీలో వాహనాలు, సామగ్రి

మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి, పట్టిన చేపలు అమ్మడానికి కావాల్సిన వాహనాలను ప్రభుత్వం వివిధ పథకాల కింద 60 నుంచి 80 శాతం సబ్సిడీలో అందజేసింది. 2014 నుంచి 20 16 వరకు 104 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలతో పాటు లగేజి ఆటోలు రూ.83.2 లక్షల సబ్సిడీతో ఇవ్వగా 556 మందికి వలలు, తెప్పలకు రూ.27.80 లక్షలు, పొదుపు సేతు పథకం కింద 316 మందికి 5.69 లక్షల లబ్ధి చేకూర్చింది. ఇక ఐఎఫ్‌డీఎస్‌ కింద(సమీకృత మత్స్య అభివృద్థ్ది పథకం) 2,664 మందికి రూ.10.28 కోట్లతో ద్విచక్ర వాహనాలు, 69 మందికి లగేజీ ఆటోలను అందజేసింది. అంతేకాకుండా రూ.28.42 కోట్లతో 6,009 మంది మత్స్యకారులకు సంచార చేపల అమ్మక వాహనాలు, పోర్టబుల్‌ ఫిష్‌ కియో స్క్‌, హైజెనిక్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలు, ప్లాస్టిక్‌ ఫిష్‌ క్రేట్స్‌, ఇన్సులేటెడ్‌ ట్రక్‌, విసురుడు వలలు, తెప్పలు, ఫిష్‌ ఫుడ్‌ కియోస్క్‌, కొత్త చేపల చెరువుల నిర్మాణం, మహిళా మత్స్యకారులకు రివాల్వింగ్‌ ఫండ్‌, రీ సర్కిలేటరీ ఆక్వా కల్చర్‌ లాంటి ప్రయోజనాలను ప్రభుత్వం చేకూర్చింది. ఇక ప్రధాన మంత్రి మత్స్య సంపద అభివృద్థి పథకం కింద రూ.88.9 లక్షలతో 22 మందికి చేపల పౌంపాండ్స్‌ నిర్మాణం, మంచి నీటి చేపల హేచరీలు, రీ సర్కిలేటరీ ఆక్వా కల్చర్‌, మొబైల్‌ ఫిష్‌ రిటైల్‌ ఔట్‌లెట్స్‌ పథకాలు అందజేసింది.

రూ.400 కోట్లకు పెరిగిన చేపల వ్యాపారం..

2014కు ముందు తినడానికి చేపలు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎగుమతి చేసే పరిస్థితికి ఎదిగిన నల్లగొండలో ఏటా రూ.400 కోట్ల చేపల వ్యాపారం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులతో పాటు ప్రధాన జలాశయాలైన నాగార్జున సాగర్‌, మూసీ, ఏకేబీఆర్‌ లాంటి వాటిల్లో ఈ చేపల ఉత్పత్తి ఏటా గణనీయంగా వస్తున్నది. ప్రధానంగా ఆయా చెరువులు, జలాశయాల్లో కొర్రమీను, బొచ్చ, రవ్వ, పాంప్లెంట్‌, జెల్ల, బురక, చందమామ, ఆలుగ, బురద మట్ట లాంటి చేపలు లభ్యమవుతున్నాయి. ఈ చేపలు ఇక్కడి అవసరాలు తీరాక ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 25 వేల మత్స్యకారులు ఆయా చెరువుల్లో ఉన్న చేపలను పట్టి ఏటా రూ.400కోట్లు ఆర్జిస్తున్నట్లు మత్స్యశాఖ యంత్రాంగం అంటుంది.

ఇతర రాష్ర్టాలకు చేపలు ఎగుమతి అవుతున్నాయి

ఏడేండ్ల కింద నల్లగొండలో చేపలు దొరకాలంటేనే కష్టంగా ఉండేది. అలాంటిది ఇవ్వాళ నల్లగొండ నుంచి టన్నుల కొద్ది చేపలు వేరే రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.4 నుంచి 5 కోట్లు వెచ్చించి అన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు పోయడమే కారణం. అలాగే జిల్లాలో మత్స్య అభివృద్ధ్ది కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేయడంతోనే ఈ రోజు జిల్లాలో రూ.400 కోట్ల చేపల వ్యాపారం జరుగుతుంది. దాంతో వేల మత్స్యకారుల కుటుంబాలు సంతోషంగా మెరుగైన జీవనం గడుపుతున్నారు.

మర్రి వెంకయ్య, మత్స్యశాఖ అధికారి, నల్లగొండ

2023-06-08T00:40:36Z dg43tfdfdgfd