యాదగిరిగుట్టలో ఘనంగా నిత్యారాధనలు

యాదగిరిగుట్ట, జూన్‌ 7 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొ ల్పి తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతును జరిపించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్‌ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. అనుబంధ శివాలయంలో సంకష్టహరచతుర్ధి సందర్భంగా పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 15వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.20,15, 668 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్‌.గీత తెలిపారు.

2023-06-08T00:25:30Z dg43tfdfdgfd