సతతం.. హరితం

ఒక పిలుపుతో

పసి చేతులు

దోసిళ్లతో

పచ్చని మొక్కగా తమ

రేపటిని నాటుకున్నారు

పండు ముదుసలి

లోకానికి చెట్టునే

చిట్ట చివరి కనుక చేశాడు

నడిచేదారులు సింగిడి కొమ్మలు

బంజరు నేలలు

బతుకమ్మ కొలువులు

పొలం గట్లు, ఇంటి పట్లు

వాగూ వాకిలి అంతటా చెట్టడుగు పెట్టింది

ఊరికొక్క మొక్కల కొలువు

తీరుకొక్క కాత, పూత

వేసారిన అడవికి

మాటిచ్చి పంపిన పిలకలు

కావి రంగుకు తమ కొమ్మల కుంచెలతో

నీలాకు పచ్చను అద్దాయి

కోట్లాది

పచ్చటి చినుకుల్ని

రాల్చి వట వృక్షాల్ని చేసుకున్న

సంకల్పం దేశ పటం మీద

పచ్చ బొట్టై నిలబడ్డది

ఈ నేలను

నిలిచి పోనున్న నిత్య వసంతం

నోరులేని జీవాలకు

బోనాన్ని వండి వార్చిన సంబురం

మట్టి, చెట్టూ

పిట్టా

జలం, జీవం, జీవనం..

సతతం..హరితం

సతతం ..హరితం

మా హరిత హారం

ధరిత్రి సిగలో మన చేతులు నాటిన

ఆకుపచ్చ మందారం..!

Devanapalli Veenavani

దేవనపల్లి వీణావాణి

26.05.2023

2023-06-05T08:09:35Z dg43tfdfdgfd