అబ్బాయి వయసు 20.. యువతి 22 ఏళ్లు..! పెళ్లికి కుటుంబం ఏర్పాట్లు.. అంతలోనే అధికారుల ఎంట్రీ.. చివరకు ఏమైందంటే..!

Karimnagar | ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు. ఆ యువతికి 22 సంవత్సరాలు. యువతీ యువకుల పెళ్లికి ఇరుకుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. గురువారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అధికారులు రంగప్రవేశం చేసి వివాహాన్ని నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌లోని గంగిరెద్దులకాలనీలో ఇదే గ్రామానికి చెందిన నర్రాగుల సమ్మయ్య-సారవ్వకు నర్రాగుల కుమార్‌ (20) సంవత్సరాలు. తిమ్మాపూర్‌ మండలం నల్లగొండ గ్రామానికి 22 సంవత్సరాల యువతితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి.

కొండాపూర్‌లోని వరుడి ఇంటి వద్ద గురువారం వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, కుమార్‌కు 21 ఏండ్లు పూర్తికాకపోవడంతో పలువురు అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో రెవెన్యూ, ఐసీడీఎస్‌ అధికారులు రంగ ప్రవేశం చేసి వివాహాన్ని అడ్డుకున్నారు. కుమార్‌కు వివాహ వయసు వచ్చిన తర్వాత పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అంతే కాకుండా, వివాహ వయస్సు వచ్చే వరకు పెళ్లి చేయబోమని వారితో లిఖితపూర్వకంగా సంతకాలు తీసుకున్నారు. ఇక్కడ ఐసీడీఎస్‌ ఏసీడీపీవో అరవింద, ఆర్‌ఐ శైలజ, ఐసీపీఎస్‌ అధికారిని శాంతకుమారి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు రాజశ్రీ, ఇందిర, హెల్ప్‌లైన్‌ కిరణ్‌, పోలీసులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

2023-06-08T15:27:38Z dg43tfdfdgfd