GANESH VISARJAN 2024 ఈసారి వినాయక నిమజ్జనం ఎప్పుడొచ్చింది.. ఈ పర్వదినాన ఎన్ని శుభ ముహుర్తాలున్నాయో తెలుసా...

Ganesh Visarjan 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది భాద్రపద మాసంలో అనంత చతుర్దశి తిథి వేళ వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ నిమజ్జనం ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం.. ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...

Ganesh Visarjan 2024 హిందూ మతంలో అన్ని పండుగల కంటే భిన్నంగా వినాయకుని పండుగ జరుపుకుంటారు. వినాయకుడి పండుగను నవరాత్రుల పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ప్రారంభమయ్యే వేడుకలు అనంత చతుర్దశి తిథి నాడు ముగుస్తాయి. అయితే కొందరు తమ ప్రాంతాల్లో 3, 5, 7, 9, 11 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే చివరికి పదకొండో రోజున అనంత చతుర్దశి వేళ వినాయక ఉత్సవాలకు ముగింపు రోజుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం ఎప్పుడు జరుపుకోనున్నారు.. ఈ నిమజ్జనానికి శుభ ముహుర్తాలు ఎప్పుడొచ్చాయి.. అసలు వినాయకుడిని ఎందుకని నీళ్లలో నిమజ్జనం చేస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..వినాయక నిమజ్జనం ఎందుకంటే..

హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ దేవుళ్ల ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లోనే ఉంచి పూజలు చేస్తాం. అయితే ఒక్క గణపతిని మాత్రమే నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే వినాయకుడి విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తారు. ఈ కాలంలో చెరువుల్లో, నదుల్లో, ఇతర జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు కూడా తేటపడతాయి. ఈ ఒండ్రు మట్టి మన శరీరానికి ఆనడం మంచిది. ఇందులో అనేక ఔషధ గుణాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే కీటకాలన్నీ చనిపోతాయి.

శుభ ముహుర్తాలివే..

ఈ సంవత్సరం భాగ్యనగరంలో సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం నుంచి వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ నిమజ్జనం మరుసటి రోజు అంటే 17 సెప్టెంబర్ 2024 అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఇందులో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఖైరతాబాద్ మహా గణపతికి ఎప్పటినుంచో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:40 గంటల వరకు నిమజ్జనానికి శుభ ముహర్తం ఉందని పండితులు చెబుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:36 గంటల నుంచి సాయంత్రం 5:07 గంటల వరకు, ఆ తర్వాత రాత్రి 8:07 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు, చివరగా రాత్రి 11:07 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఉంటుందని పండితులు నిర్ణయించారు. అయితే ఈ ముహుర్తాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

ఉత్సాహంగా ఊరేగింపు వేడుకలు..

వినాయక నిమజ్జనం సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం గణేష్ మంటపం నుంచి ‘గణపతి బప్పా మోరియా’ అంటూ విగ్రహాన్ని కదిలిస్తారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ సమయంలో డప్పు వాయిద్యాలు, డిజే పాటలతో చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ వేడుకల్లో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇలా దారి పొడవునా జై బోలో గణేష్ మహారాజ్‌ అంటూ నినాదాలతో భాగ్యనగరమంతా హోరెత్తుతుంది. చివరగా వినాయక విగ్రహాలను చెరువులు, నదులు, సమీపంలోని జలాశయాలకు తీసుకెళ్తారు. విగ్రహాలను నిమజ్జనం చేయడంతో ఉత్సవ పరిసమాప్తం అయినట్టు భావిస్తారు.

గణపతి నిమజ్జనం ప్రాముఖ్యత..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, భాద్రపద మాసం శుక్ల పక్షంలో చతుర్దశి తిథి నాడు అనంత చతుర్దశి వేడుకలను జరుపుకుంటారు. ఇదే రోజున వినాయక నిమజ్జనానికి సరైన రోజని భావిస్తారు. ఈ పర్వదినాన గణేష్ మహారాజుకి సంప్రదాయబద్దంగా వీడ్కోలు పలుకుతారు. మళ్లీ తిరిగి వచ్చే ఏడాది రావాలని, అంతవరకు వినాయకుడు కైలాసానికి వెళ్లొస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు.

నిమజ్జనం వల్ల కలిగే లాభాలు..

వినాయక నిమజ్జనం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గణేష్ చతుర్థి నాటికి జోరుగా వర్షాలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వరద తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వినాయకుడి పూజకు వాడిన ఆకులను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాదు నీటిలోని ప్రమాదకరమైన బ్యాక్టిరీయా నశిస్తుంది. ఆక్సీజన్ శాతం కూడా పెరుగుతుంది. ఇలా వినాయక నిమజ్జనం వల్ల అనేక లాభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు.All Images Credited To AP Photo/Mahesh Kumar A.​Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-16T10:09:03Z dg43tfdfdgfd