సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు సూర్య కిరణాలు నేరుగా చర్మం మీద పడితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా బాగా ఎండల్లో తిరిగేవారికి, పని చేసేవారికి ఈ ముప్పు ఎక్కువ.

కాబట్టి, ఎండ నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి? సన్‌స్క్రీన్‌ ఎలా వాడాలి? నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా చూద్దాం.

చాలామంది ఎండల్లో వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకుంటారు. అది సులువైన మార్గం కూడా. మెలనోమా చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నవారిలో 80 శాతానికి పైగా కేసులకు ఎండలే కారణం. ఏటా చర్మ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది చర్మ క్యాన్సర్ బారినపడుతున్నారని, 2040 నాటికి ఈ కేసుల సంఖ్య 50 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

అయితే, ఎండల కారణంగా చర్మ క్యాన్సర్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో సన్‌స్క్రీన్ లేపనాలను ఎలా, ఎప్పుడు వాడాలి? అన్న విషయాల్లో చాలామందికి సందేహాలు ఉన్నాయి.

అందుకే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను, సమాధానాలను ఇప్పుడు చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. చర్మంపై ఎండ పడితే ఏమవుతుంది?

ఎండలో బయటికి వెళ్లినప్పుడు మన చర్మంపై సూర్య కిరణాలు పడతాయి. అప్పుడు ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలు (యూవీ కిరణాలు) మన చర్మంలోని డీఎన్‌ఏకు, ప్రొటీన్లకు, కణాలకు తీవ్ర హాని కలిగిస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన మెడిసిన్ ప్రొఫెసర్ రిచర్డ్ గల్లో చెప్పారు.

నిజానికి సూర్యుడి నుంచి వచ్చే తక్కువ తీవ్రతతో కూడిన యూవీ కిరణాలు మన చర్మంపై పడటం మంచిదే. మన చర్మ కణాలు విటమిన్ డీని ఉత్పత్తి చేసి, శోషించుకునేందుకు సూర్య కిరణాలు దోహదపడతాయి. కానీ, తీవ్రమైన ఎండ తాకినప్పుడు మాత్రం మన చర్మం తనను తాను రక్షించుకునేందుకు మెలనిన్‌ అనే వర్ణకద్రవ్యాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది.

ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే, మన చర్మం తట్టుకోలేదు. దాంతో దద్దుర్లు వస్తాయి. డీఎన్‌ఏ దెబ్బతినే ముప్పు ఉంటుంది. దాంతో, చిన్నవయసులోనే చర్మం బాగా ముదిరిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అది చర్మ క్యాన్సర్ వృద్ధి చెందేందుకు దారితీసే ప్రమాదం ఉంటుందని రిచర్డ్ గల్లో వివరించారు.

చాలా రకాల చర్మ క్యాన్సర్లకు ప్రధాన కారణం అతినీల లోహిత కిరణాలే అని పరిశోధనలు చెబుతున్నాయి.

క్యాన్సర్ కారకాల్లో సూర్యుడి యూవీ రేడియేషన్ ఒకటని, అది తక్కువ తీవ్రతలో చర్మాన్ని తాకినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు.

2. ఎస్‌పీఎఫ్ అంటే ఏంటి? ఎంత ఉంటే మంచిది?

సన్‌‌స్క్రీన్ లోషన్లు కొనేటప్పుడు అందులో ఎస్‌పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) ఎంత ఉందో చూడాలి. సన్‌స్క్రీన్ బాటిళ్లపై ఇది రాసి ఉంటుంది. ఆ క్రీమ్ లేదా లోషన్ సూర్యుడి రేడియేషన్ నుంచి మన శరీరానికి ఎంతమేరకు రక్షణ కల్పించగలదన్నది ఈ ఎస్‌పీఎఫ్ నంబర్ సూచిస్తుంది.

సన్‌స్క్రీన్‌ లోషన్‌లో ఎస్‌పీఎఫ్ ఎంత ఎక్కువ ఉంటే మన చర్మానికి రక్షణ అంత ఎక్కువ ఉంటుంది. ఆ నంబర్ తక్కువగా ఉండే లోషన్లు సూర్యుడి రేడియేషన్‌ నుంచి తక్కువ రక్షణ కల్పిస్తాయి.

భారతీయుల స్కిన్‌కు ఎస్‌పీఎఫ్ 15 నుంచి 40 మధ్య ఉండే సన్‌స్క్రీన్ అయితే సరిపోతుందని డాక్టర్ అనూజా వైద్య లాఠీ చెప్పారు.

3. సన్‌స్క్రీన్ ఎలా రాసుకోవాలి?

సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ తీవ్రత రోజంతా ఒకేలా ఉండదు. ఉదయాన్నే పడే సూర్య కిరణాల్లో యూవీ రేడియేషన్ తక్కువగా ఉంటుంది. ఎండ పెరిగే కొద్దీ అది ఎక్కువ అవుతుంది. సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది.

సన్‌స్క్రీన్ రాసుకోగానే ఫలితం కనిపిస్తుందని, అది వెంటనే యూవీ కిరణాల నుంచి కొంతమేర రక్షణ కల్పిస్తుందని 2018లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

సన్‌స్క్రీన్ పూర్తి స్థాయిలో ప్రభావంతంగా పనిచేసేందుకు 10 నిమిషాలు పడుతుందని ఆ అధ్యయనం తెలిపింది.

అయితే, ఎండలోకి వెళ్లడానికి 20 నుంచి 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ రాసుకుంటే మెరుగైన ఫలితం కనిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా కొంత సమయం ఇస్తే లోషన్ మన చర్మంలోకి ఇంకుతుందని చెబుతున్నారు.

సన్‌స్క్రీన్ రెండుసార్లు రాసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చెమట పట్టిన తర్వాత నీళ్లతో కడుక్కున్నా, వస్త్రంతో తుడుచుకున్నా మరోసారి సన్‌స్క్రీన్ రాసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యమైన విషయం ఏంటంటే.. సన్‌స్క్రీన్‌ లోషన్లను మరే స్కిన్ క్రీమ్‌లతోనూ కలిపి వాడకూడని బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్సిటీలో సస్టెయినబుల్ మెటీరియల్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రిచర్డ్ బ్లాక్‌బర్న్ చెప్పారు.

ఒక్కో క్రీమ్‌లో ఒక్కో రకమైన రసాయనాలు వాడుతారు. ముఖ్యంగా చాలా సన్‌స్క్రీన్‌లలో జింక్ ఆక్సైడ్ ఉంటుంది. అది ఇతర క్రీముల్లోని పదార్థాలతో కలిసినప్పుడు రసాయన చర్యకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

4. విటమిన్ డి ఉత్పత్తిని సన్‌స్క్రీన్ అడ్డుకుంటుందా?

ఎముకలు బలంగా తయారవ్వడంతో, రోగ నిరోధక వ్యవస్థ మెరుగవ్వడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం వల్ల మన చర్మానికి విటమిన్ డిని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుందేమోననే అనుమానాలు ఉన్నాయి.

కానీ, సన్‌స్క్రీన్ ప్రభావం విటమిన్ డి ఉత్పత్తిపై చాలా తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

5. సన్‌స్క్రీన్‌లో విషపదార్థాలు ఉంటాయా?

సన్‌స్క్రీన్‌ క్రీమ్‌లలో విషపదార్థాలు ఉంటాయని, అవి శరీరంలో పేరుకుపోయి హాని కలిగిస్తాయనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుంటారు. అయితే, అవన్నీ అపోహలేనని రిచర్డ్ గల్లో చెప్పారు.

క్రీమ్ ఎలా వాడాలనే సూచనలు చాలావరకు బాటిళ్ల మీద ఉంటాయి. ఆ సూచనల ప్రకారం వాడితే ఎలాంటి సమస్యా ఉండదని ఆయన అన్నారు.

అయితే, కొందరికి సన్‌స్క్రీన్ వల్ల అలర్జీ, దురద లాంటి సమస్యలు వస్తుంటాయని గల్లో చెప్పారు. చర్మ క్యాన్సర్‌తో పోలిస్తే అవి చాలా చిన్న సమస్యలు కాబట్టి సూచనల ప్రకారం సన్‌స్క్రీన్‌లను వాడటం సురక్షితమని ఆయన అన్నారు.

బ్రిటన్, ఐరోపా, అమెరికాలలో అనుమతి పొందిన సన్‌స్క్రీన్‌లు సురక్షితమని, ప్రభావవంతంగా పనిచేస్తాయని అధ్యయనాల్లో తేలింది.

6. పెద్దలు ఎంత వాడాలి?

పెద్దలు ముఖానికి, శరీరానికి కలిపి రోజూ 2 mg/cm2 (0.16in2) అంటే సుమారు 6 టీ స్పూన్ల సన్‌స్క్రీన్ వాడాలని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సూచిస్తోంది. అంతకంటే తక్కువ వాడితే ఆశించినంత ఫలితం ఉండకపోవచ్చని అంటోంది.

సాధారణంగా చాలామంది మోతాదు కంటే తక్కువ సన్‌స్క్రీన్ వాడుతున్నారని, దాంతో వారు తమ శరీరాన్ని సూర్యుడి రేడియేషన్ నుంచి పూర్తి స్థాయిలో కాపాడుకోలేకపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

వీలైతే రోజూ సన్‌స్క్రీన్ రాసుకోవాలని డాక్టర్ అనూజా వైద్య లాఠీ చెప్పారు.

‘‘సన్‌స్క్రీన్ ఉదయమే రాసుకోవాలి. రాత్రి అవసరం లేదు. ఉదయం 8-9 నుంచి సాయంత్రం 5-6 వరకూ మొహంపై సన్‌స్క్రీన్ ఉంటే మంచిది. మీరు బయట పనిచేయాల్సి వచ్చినా లేదా ఎండలో ఎక్కువసేపు గడపాల్సి వచ్చినా మీతోపాటు సన్‌స్క్రీన్ లోషన్‌ను కూడా తీసుకెళ్లండి. ముఖ్యంగా జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్‌లు ఉండే సన్‌స్క్రీన్ ఎంచుకుంటే మంచిది. కేవలం ముఖంపై మాత్రమే కాదు, చెవులు, మెడ, చేతులకూ సన్‌స్క్రీన్ రాసుకోవాలి’’ అని ఆమె సూచిస్తున్నారు.

7. పిల్లలు సన్‌స్క్రీన్ వాడొచ్చా?

ఆరు నెలల లోపు పిల్లలకు సన్‌స్క్రీన్ లోషన్లు వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే పెద్ద పిల్లలకు వాడొచ్చు. యూవీ కిరణాల ప్రభావం పిల్లల చర్మంపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆరు నెలలు దాటిన పిల్లలకు సన్‌స్క్రీన్ వాడటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలను బయటికి వెళ్లనీయొద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే, వదులుగా ఉండే బట్టలు వేయాలి. గొడుగులు వాడాలి.

రెండేళ్ల వయసు పిల్లలకు రోజూ రెండు టీ స్పూన్లు, అయిదేళ్ల పిల్లలకు మూడు టీ స్పూన్లు, తొమ్మిదేళ్ల పిల్లలకు నాలుగు టీ స్పూన్లు, 13 ఏళ్ల పిల్లలకు 5 టీ స్పూన్ల సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాస్త పెద్ద పిల్లలకు రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

8. సన్‌స్క్రీన్, సన్‌బ్లాక్ మధ్య తేడా ఏంటి?

సూర్యుడికి, మనకు మధ్యలో సన్‌స్క్రీన్ ఉంటుంది. యూవీ కిరణాలను అది శోషించుకుంటుంది. అడ్డుకోదు. అలా హానికరమైన సూర్య కిరణాలు మన చర్మానికి తాకకుండా సన్‌స్క్రీన్‌ రక్షణ కలిపిస్తుంది.

సన్‌బ్లాక్ మాత్రం ఒక అడ్డుగోడలా పనిచేస్తుంది. యూవీ కిరణాలు అందులోంచి ప్రసరించలేవు. దాంతో, అవి మన చర్మాన్ని తాకవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-06-11T06:56:06Z dg43tfdfdgfd