CHIVDA: చివ్‌డా రుచిగా రావాలంటే.. హోటల్ స్టైల్‌లో ఈ కొలతలతో చేయండి..

కారం అటుకులు, పొడి అటుకులు, చివ్‌డా, చుడ్వా.. ఇలా చాలా పేర్లతో పిలిచే ఈ స్నాక్ తయారీ ప్రాంతం బట్టి మారుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, పిల్లలకు స్నాక్స్ కోసం చాలా మంది ఈ అటుకుల్ని చేసి పెట్టుకుంటారు. ఒక్కసారి చేస్తే కనీసం రెండు వారాలైనా నిల్వ ఉంటాయి. అయితే రుచి ప్రతిసారీ పక్కాగా కుదరాలంటే ఈ కొలతలతో, కొన్ని మార్పులతో చేసి చూడండి. బయట హోటల్ లో కొన్న రుచి వస్తుంది. అదెలాగో వివరంగా చూసేయండి.

చుడ్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:

4 కప్పుల సన్నం అటుకులు

6 చెంచాల నూనె

2 ఉల్లిపాయలు, పొడవాటి సన్నటి ముక్కలు

సగం కప్పు పల్లీలు

పావు కప్పు పుట్నాలు

పావు కప్పు జీడిపప్పు ముక్కలు

పావు కప్పు బాదాం ముక్కలు

పావు కప్పు ఎండు కొబ్బరి పొడవాటి ముక్కలు

1 టీస్పూన్ జీలకర్ర

చిటికెడు ఇంగువ

2 పచ్చిమిర్చి, ముక్కలు

2 కరివేపాకు రెమ్మలు

2 చెంచాల కిస్‌మిస్

1 చెంచా నువ్వులు

1 చెంచా పసుపు

1 చెంచా ఉప్పు

సగం చెంచా పంచదార

చుడ్వా తయారీ విధానం:

1. ముందుగా కొలతల ప్రకారం కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఈ అటుకులు చేయడం సులభం అవుతుంది. మాడిపోయే అవకాశం ఉండదు.

2. ఒక పెద్ద కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. సన్నం మంట మీద పెట్టుకుని నూనె లేకుండా ముందుగా అటుకుల్ని వేయించుకోవాలి. కలుపుతూ, కడాయి కదుపుతూ ఉంటే అయిదు నిమిషాల్లో అవి కరకర అవుతాయి. వాటి రంగు మాత్రం మారకూడదు.

3. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి.

4. అదే కడాయిలో నూనె వేసుకోవాలి. ముందుగా సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పూర్తిగా రంగు మారి కరకరలాడేదాకా వేయించుకోవాలి.

5. ఉల్లిపాయల ముక్కల్ని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో అటుకుల కోసం తాళింపు పెట్టుకోవాలి.

6. ముందుగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమన్నాక కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని రెండూ వేగనివ్వాలి.

7. ఇప్పుడు పల్లీలు, పుట్నాలు వేసుకుని వేయించాలి. అవి కాస్త రంగు మారతాయనగా జీడిపప్పు ముక్కలు, బాదాం ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా వేయించాలి.

8. చివరగా ఇంగువ కూడా వేసేసుకొని బాగా కలపాలి. అన్నీ వేగాయి అనేటప్పుడు నువ్వులు, కిస్‌మిస్ వేసుకుని 30 సెకన్ల పాటూ వేయించాలి.

9. వెంటనే పసుపు, ఉప్పు, పంచదార కూడా వేసుకుని అన్నీ ఒకసారి కలియబెట్టి స్టవ్ కట్టేయాలి.

10. ఇప్పుడు ముందుగా వేయించుకున్న అటుకుల్ని ఈ తాలింపులో కలిపేసుకోవాలి. అన్నీ కలిసేదాకా బాగా పైకీ కిందకీ అంటూ ఉండాలి. అటుకులన్నీ పూర్తిగా పసుపు రంగు లోకి మారేదాకా కలుపుతూనే ఉండాలి.

12. చివరగా ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్నీ వేసుకుని మరోసారి కలుపుకుంటే చివ్‌డా రెడీ అయినట్లే.

11. ఇది పూర్తిగా చల్లారాక గాలి చొరవని డబ్బాలో నిల్వ చేసుకోవడమే. ఫ్రిజ్ లో పెట్టకూడదు.

ఈ కొలతలతోనే చివ్‌డా చేసి చూడండి. పక్కాగా కుదురుతుంది.

2024-07-27T10:22:56Z dg43tfdfdgfd