DEEPIKA'S SECRET: తన చర్మ సౌందర్య రహస్యం చెప్పేసిన దీపిక పదుకోణ్.. మీరూ ఫాలో అయ్యేంత సులువు

దీపికా పదుకోణ్ చర్మ సౌందర్యం గురించి చెప్పక్కర్లేదు. ప్రతి సెలిబ్రిటీ వాళ్ల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఏం వాడతారో తెల్సుకోవాలనే ఉత్సుకత మనలో ఉంటుంది. దీపికా పదుకోణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్ కోసం తన స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేశారు. ఈ 38 ఏళ్ల నటి చర్మ రహస్యం, స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్. ప్రతి ఉత్పత్తిలో సహజంగానే కొన్ని పదార్థాలుండేలా చూసుకుంటారట దీపిక. అవేంటో మనమూ తెల్సుకుందాం. మనమూ ఫాలో అయ్యేంత సింపుల్ రొటీన్ అది.

ఇన్‌స్టా పోస్ట్:

“స్కిన్ కేర్ విషయానికొస్తే.. సరైన ఆహారం తీసుకోవాలి, నిద్ర బాగా పోవాలి, శరీరానికి తగ్గ హైడ్రేషన్ ఉండాలి. శారీరక శ్రమ ఉండాలి. ఇవన్నీ చర్మ ఆరోగ్యానికి మూల స్తంభాలు. సింపుల్, క్రమం తప్పకుడా ఫాలో అయ్యే స్కిన్ కేర్ రొటీన్ నాది” అని ఇన్‌స్టా పోస్టులో దీపిక రాసుకొచ్చారు.

ఎలాంటి ఉత్పత్తులు వాడుతుందంటే?

వారంలో ఒకరోజు మాత్రం ప్రత్యేకంగా చర్మం కోసం శ్రద్ధ తీసుకోడానికి కేటాయిస్తుంది దీపిక. ఫుల్ బాడీ మసాజ్ చేయించుకోవడం, ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, హెయిర్ మాస్క్ వాడటం లాంటివన్నీ ఆరోజు చేస్తుంది. అలాగే రోజూవాడే చర్మం ఉత్పత్తుల్లో కమలం పువ్వు ముఖ్య పదార్థంగా ఉండేలా చూస్తుందట. అలాగే కంటి కింద వాడే అండర్ ఐ క్రీములో గులాబీ లక్షణాలు, సన్‌స్క్రీన్ లో పసుపు ముఖ్య ఇంగ్రీడియంట్ గా ఉండేలా చూసుకుంటుంది. వీటితో పాటే మంజిష్ట మడ్ ఫేస్ మాస్క్ కూడా వాడమని చెబుతుంది దీపిక.

1. కమలం:

కమలంలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు (AHA) చర్మాన్ని బాగా శుభ్రం చేస్తాయి. ప్రకాశవంతంగా మారుస్తాయి. ఇవి చర్మం మీదున్న మృత కణాల్ని కూడా తొలగిస్తాయి. తేలికపాటి స్క్రబ్ లాగానూ పనిచేస్తాయి. మృతకణాలు తొలిగిపోతే చర్మం దానికదే ప్రకాశవంతంగా మారుతుంది.

2. పసుపు:

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది చర్మం ఎరుపెక్కకుండా, ఇరిటేషన్ రాకుండా చూస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువుంటాయి. అంతే కాక ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. చర్మం దెబ్బ తినకుండా, యవ్వనంగా ఉండేలా కాపాడుతుంది.

3. గులాబీ:

గులాబీ తత్వం ఉన్న ఉత్పత్తుల్లో విటమిన్ ఏ, సి, డి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావాల్సిన తేమ అందిస్తాయి. కంటికింద సున్నితంగా ఉండే చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. చర్మం పొడిబారకుండా కాపాడతాయి. అలాగే కంటి కింద డార్క్ సర్కిల్స్ కూడా గులాబీ తగ్గిస్తుంది.

దీపికా పదుకోణ్ స్కిన్ కేర్ రొటీన్:

ఇలాంటి ఉత్పత్తులు వాడటంతో పాటే మరికొన్ని నియమాలు పాటిస్తుంది దీపిక.

  1. మినరళ్లు, విటమిన్లున్న ఆహారంత తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్య మెరుగుపడుతుంది. బెర్రీలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.
  2. సరైన నిద్ర వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. నిద్ర పోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. పూర్తి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
  3. చర్మంలో తేమ ఉండటం ముఖ్యం. లేదంటే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకోసం నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోనుంచి టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది.
  4. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మంలో తేమ పెరుగుతుంది. చర్మం కణాలు పునరుత్పత్తి అయ్యేలా సాయపడుతుంది. దానివల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
  5. క్లెన్సింగ్, హైడ్రేషన్ ఈ రెండూ చర్మ అందానికి రహస్యాలు. కాబట్టి మంచి ఫేస్ వాష్ వాడి చర్మం శుభ్రం చేసుకోవాలి.
  6. ఫేస్ మాస్క్ కనీసం వారానికి ఒక్క సారైనా పెట్టుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. చర్మం తాజాగా మారుతుంది. చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి. చిన్న గీతల్లాంటివి పోతాయి.

2024-07-27T07:22:25Z dg43tfdfdgfd