GANESH CHATURTHI 2024: పెసర గణేషుడు- ఆవాలు వినాయకుడు- వెరైటీ గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రెస్ సిక్కోలులోని ఈ పల్లెటూరు

Vinayaka Chavithi 2024: తొలి పూజలు అందుకునే గణపతి విగ్రహాల ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తొలి పూజ అయిపోయిన తర్వాత అందరీలోనూ ఒకటే చర్చ నడుస్తుంది. ఏ ఊరి గణపతి ఎలా ఉందంటూ ఆరా తీస్తుంటారు. పూజలోనూ, గణపతి విగ్రహం ఏర్పాటులోనూ తామే బెటర్‌గా ఉండాలని ట్రై చేస్తుంటారు చాలా పూజాకమిటీలు. కొందరు పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటులో శ్రద్ధపెడితారు. మరికొందరు చిన్నదైనా వెరైటీగా రూపొందించాలని చూస్తుంటారు. మరికొందరు మట్టిగణపతిని అందంగా తీర్చిదిద్ది బెస్ట్ అనిపించుకుంటారు. అలాంటి జాబితాలోకి వస్తారు శ్రీకాకుళం జిల్లాకు శివారున ఉన్న బొరివంక గ్రామం. 

ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలంలో ఉండే ఈ బొరివంక పేరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పల్లెటూరు. ఆ ఊరి కాళీమాత దేవాలయానికి ఎంత భక్తిశ్రద్ధలతో జనం వెళ్తారో అక్కడ ఏర్పాటు చేసే వినాయక విగ్రహాన్ని కూడా అదే స్థాయిలో దర్శించుకుంటారు. చిన్న చిన్న విగ్రహాలనే వెరైటీగా అందరి కంటే భిన్నంగా ఆలోచించి తయారు చేయడం ఇక్కడి పూజా కమిటీ ప్రత్యేకత. 

Also Read: కమల్ హాసన్ సినిమాలో ఖైరతాబాద్ వినాయకుడు- ఒక్క అడుగుతో మొదలై గణేష్‌ గురించి తెలుసా?

ఈసారి కూడా బొరివంకలో ప్రత్యేకమైన గణపతిని ప్రతిష్ఠించారు ఉద్దానం యూత్ క్లబ్ సభ్యులు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ ఏకదంతుడిని తయారు చేశారు. పెసర విత్తనాల నారును సిద్ధం చేసి ముగ్ద గణపతిని తయారు చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జిల్లాలో వైరల్‌ అవుతోంది.  

ఉద్దానం యూత్ క్లబ్ గతంలో కూడా వెరైటీ వినాయక విగ్రహాలను తయారు చేయించింది. శిల్పి బైరి తిరుపతి ఇలాంటి వెరైటీ విగ్రహాల తయారీలో ప్రసిద్ధుడు. 2012 నుంచి నేటి వరకు ఏటా వైవిధ్యమైన ప్రతిమలు తయారు చేస్తూ అందరి అభినందనలు పొందుతున్నారు. ఈ వెరైటీ వినాయక విగ్రహాలను పర్యావరణానికి హాని కలిగించకుండా తయారు చేయడం ఆయన ప్రత్యేకత. 

బొరివంకలో ఇప్పటి వరకు ప్రతిష్టించిన వెరైటీ వినాయక విగ్రహాలు ఇవే

కొబ్బరికాయలు గణపతి(2012), నలుగు గణపతి (2013), వరి నారు గణపతి(2014), వనమూలికల గణపతి (2015), పామాయిల్ గణపతి(2016), గోధుమ నారు గణపతి (2017),కొబ్బరి పువ్వుల గణపతి(2018), సుద్ధముక్కల గణపతి(2019),నల్ల జీడిపిక్కల గణపతి(2021), ఆవాలు గణపతి(2022), పసుపు కొమ్ముల గణపతి(2023) ఇలా వైవిధ్యంగా విగ్రహాలు తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా పెసర నారుతో విగ్రహాన్ని తయారు చేసి ఆకట్టుకున్నారు.  ఇదే స్పూర్తితో ఆ ఊరిలోనే మరోచోట ఆవాలుతో విగ్రహాన్ని తయారు చేశారు. ఆవాలతో తయారుచేసిన శ్రీ అయోధ్య బాల రామ గణపతికి పూజలు చేస్తున్నారు.  

Also Read: అయోధ్య మందిరంలో బాలాపూర్ వినాయకుడు - ఈ సారి వేలంలో లడ్డూ ధర ఎంత పలుకుతుందో!

 

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... చవితి రోజున అదే ఊరిలో ఓ రైతుకి తోటలో వినాయక ఆకారంలో కర్రపెండలం లభించింది. దీనికి ఆ రైతుల పూజలు చేస్తున్నారు. మజ్జి బొనమాలి అనే రైతు కూర కోసం కర్ర పెండలం తవ్వగా ఆ దుంప అచ్చం వినాయకుడి రూపంలో కనిపించింది. అంతే దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి గణేష్‌ మండపంలో పెట్టి పూజలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఈ వినాయకుడి రూపంలో ఉన్న దుంపను చూసేందుకు తరలి వస్తున్నారు. 

2024-09-07T08:56:59Z dg43tfdfdgfd