GANESHOTSAV | మసీదుల్లో గణేశ్‌ నవరాత్రులు.. 44 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం..

  • 40 ఏండ్లుగా మసీదుల్లో విగ్రహాల ప్రతిష్ఠాపన
  • మహారాష్ట్రలోని గోటిఖిండీలో మత సామరస్యం
  • వారిని చూసి మరికొన్ని గ్రామాలు ముందుకు
  • నిమజ్జనం రోజున ఊళ్లన్నీ కలిసి భోజనాలు

Ganeshotsav | ముంబై, సెప్టెంబర్‌ 15 (నమస్తే తెలంగాణ): గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌, సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ-ముస్లింల సౌభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. ఇకడి కొన్ని మసీదుల్లో 40 ఏండ్లకుపైగా వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతున్నది. 1982లో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత తరం ముందుకు తీసుకెళుతుంది. వివరాల్లోకి వెళ్తే.. సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాలో గోటిఖిండీ అనే గ్రామం ఉంది. ఇక్కడి జుజర్‌ ఖోలో ఉన్న మసీదులో ప్రతీ ఏడాది పది రోజుల పాటు న్యూ గణేశ్‌ మండలి వారు గణపతిని ప్రతిష్ఠిస్తారు. 44 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో హిందూ, ముస్లింలు ఇకడికి వస్తుంటారు.

ఎలా మొదలైందంటే..?

ఈ సంప్రదాయం ఎలా మొదలైందనే దాని వెనక ఆసక్తికరమైన కథను గోటిఖిండీ గ్రామానికి చెందిన అశోక్‌ పాటిల్‌ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఒకసారి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఒకరోజు భారీ వర్షం కురిసింది. మండపం లేకపోవడంతో వర్షానికి వినాయకుడి విగ్రహం తడిచిపోయింది. గ్రామానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి ఆ దృశ్యాన్ని చూశారు. గణేశ్‌ మండలికి చెందిన భక్తులకు ఈ విషయం చెప్పారు. అప్పుడే నిజామ్‌ పఠాన్‌ అనే ఆయన వర్షంలో పూర్తిగా తడిచిపోయిన వినాయకుడి విగ్రహాన్ని దగ్గరలోని మసీదులో ఉంచాలని కోరారు. అకడున్న వారంతా ఆలోచించి, గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీదులో ఉంచారు. నిమజ్జనం వరకు ఆ ఏడాది వినాయకుడిని ఆ మసీదులోనే ఉంచి పూజలు చేశారు. 1961లో గోటిఖిండీ గ్రామంలో గణేశ్‌ ఉత్సవాలను మొదలుపెట్టిన బృందంలో అశోక్‌ పాటిల్‌ తండ్రి కూడా సభ్యుడు. 1986లో ఇదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పొరుగున ఉన్న బావ్చీ గ్రామంలో గణేశ్‌ ఉత్సవాల కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లారు. హిందూ, ముస్లిం వర్గాలకు చెందినవారు ఆ కార్యక్రమంలో కలిసి పాల్గొనడాన్ని వారు గమనించారు. వారి స్ఫూర్తితో గ్రామంలోని మసీదులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు. 1961లో గణపతి ఉత్సవాలను జరిపిన వారి తరవాత రెండో తరం వారు 1986లో గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించారు. ఇప్పుడు మూడో తరం వారు కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు గణపతి పండుగ సమయంలోనే బక్రీద్‌ పండుగ కూడా వస్తుండేది. ఆ సమయంలో ముస్లింలు మేకలను కోయడం, ఖుర్బానీ చేయడం వంటివి నిలిపివేసేవారు. గణపతి నిమజ్జనం తర్వాత ఊరంతా కలిసి భోజనాలు చేస్తారు. ఊళ్లోని పురుషులు, మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రతి రోజూ ఒకో కుటుంబం హారతి సేవలో పాల్గొంటుంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హారతి ఇస్తారు. ‘రెండు వర్గాలకు చెందిన పూర్వీకులు తర్వాతి తరాలకు గొప్ప కీర్తిని వారసత్వంగా ఇచ్చారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని స్థానికుడు గణేశ్‌ థోరాట్‌ చెప్పారు.

కురుంద్వాడ్‌లోనూ..

కొల్హాపూర్‌ జిల్లాలోని కురుంద్‌ వాడ్‌లోని 5 మసీదుల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని కుదేంఖా బడేనల్‌ సాహేబ్‌ మసీదు, ఢపణపూర్‌ మసీదు, బైరాగ్దార్‌ మసీదు, శెలే మసీదు, కరకన్యా మసీదులలో వినాయకుడిని పెట్టారు. కురుంద్వాడ్‌ సంస్థానం కథ కూడా గోట్‌ ఖిండి తరహాలోనే ఉంటుంది. 1982 తర్వాతి ఏడాది నుంచి గ్రామంలోని 5 మసీదుల్లో గణపతి మండపాలను ఏర్పాటు చేయడం మొదలైంది. గ్రామానికి చెందిన పాతతరం పెద్దలు ఈ ఆచారాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని గణేశ్‌ థోరాట్‌ అన్నారు. 2018, 2019, 2020లలో గణపతి ఉత్సవాలు, మొహర్రం కలిసి వచ్చాయి. ఈ పండుగలను అకడి ప్రజలు కలిసిమెలిసి జరుపుకున్నారు. ఆ సమయంలో వినాయకుని మోదకాలు, పీరీలలో పంచే చోంగ్యా ప్రసాదం రెండూ కలిపి ప్రజలకు పంపిణీ చేసినట్టు జమీర్‌ పఠాన్‌ చెప్పారు.

2024-09-15T20:58:50Z dg43tfdfdgfd